Medical Education: మెడికల్ కాలేజీల తనిఖీలకు ఎన్‌ఎంసీ కసరత్తు
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:15 AM
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రమాణాలను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సిద్ధమైంది.
ప్రభుత్వ అధ్యాపకులతో ‘అస్సెసర్ల బృందం’ ఏర్పాటు
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు 15 రోజుల గడువు
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రమాణాలను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, యూజీ, పీజీ కోర్సుల దరఖాస్తులను పరిశీలించేందుకు అస్సెసర్ల బృందాన్ని (తనిఖీ అధికారులు) ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన అధ్యాపకులను మాత్రమే ఎంపిక చేయాలని మెడికల్ అసె్‌సమెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఎఆర్‌బీ) నిర్ణయించింది. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో 15 రోజుల్లోగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు కేవలం క్షేత్రస్థాయి తనిఖీలకే పరిమితం కాకుండా పత్రాల పరిశీలన, నివేదికల మూల్యాంకనంలో నిపుణులుగా వ్యవహరిస్తారు. ఈ తనిఖీల కోసం వెచ్చించే సమయాన్ని ‘ఆన్ డ్యూటీ’గా పరిగణిస్తారు. అస్సెసర్లకు అయ్యే ప్రయాణ, వసతి ఖర్చులతో పాటు నిర్ణీత వేతనాన్ని ఎన్‌ఎంసీనే భరిస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.