Share News

Medical Education:వైద్యవిద్యతో ఎన్‌ఎంసీవ్యాపారం!

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:05 AM

జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉన్న సీట్ల పెంపునకు సంబంధించి సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో....

Medical Education:వైద్యవిద్యతో ఎన్‌ఎంసీవ్యాపారం!

  • రిజిస్ట్రేషన్‌ ఫీజులు రెట్టింపు

  • ప్రాసెసింగ్‌ ఫీజుకు తొలిసారి స్లాబ్‌లు

  • ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఫీజుల భారం

  • కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి)ః జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉన్న సీట్ల పెంపునకు సంబంధించి సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఫీజులను రెట్టింపు స్థాయికి పెంచింది. కొత్త మెడికల్‌ కాలేజీని ప్రారంభించాలంటే కనీసం 50 సీట్లతో దరఖాస్తు చేయాలి. తొలిసారిగా స్లాబ్‌ల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఫీజులను వర్గీకరించింది. 50 సీట్ల కోసం ప్రైవేట్‌ యాజమాన్యాలు రూ.7.5 లక్షలు(+18ు జీఎస్టీ), ప్రభుత్వ కాలేజీలు రూ.6.25 లక్షలు(+18ు జీఎస్టీ) చెల్లించాలి. 100సీట్ల కోసం ప్రైవేట్‌ కాలేజీలు రూ.15 లక్షలు, ప్రభుత్వ సంస్థలు రూ.12.5 లక్షలు(+18ుజీఎస్టీ) కట్టాలి. 150సీట్ల కోసం ప్రైవేట్‌ కాలేజీలకు రూ.22.5 లక్షలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.18.75 లక్షలు(+జీఎస్టీ)గా నిర్ణయించారు. వీటికి అదనంగా రూ.2 లక్షల నాన్‌-రిఫండబుల్‌ రిజిరేస్టషన్‌ ఫీజును కూడా చెల్లించాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. కొత్తగా 150 సీట్లతో కాలేజీ పెట్టాలంటే ఏకంగా రూ.25 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించాలి. ఇక 50 సీట్లకే రూ.15 కోట్లు గ్యారెంటీగా అడుగుతున్నారు. ఇప్పటికే ఉన్న కాలేజీల్లో ప్రతి 50 సీట్ల పెంపునకు అదనంగా రూ.5 కోట్ల గ్యారెంటీని ఆరేళ్ల కాలపరిమితితో ఇవ్వాల్సి ఉంటుంది.

కొత్త కాలేజీలకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసింది. ఈనెల29నుంచి 2026 జనవరి 28 సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు తావులేదని స్పష్టం చేసింది. దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే వెంటనే తిరస్కరిస్తారు. తక్కువ సీట్లకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం లేదు. అలాగే దరఖాస్తు ఫీజు కింద చెల్లించిన మొత్తం కూడా తిరిగి రాదు. ప్రతి కాలేజీ తప్పనిసరిగా ప్రత్యేకంగా కార్పస్‌ ఫండ్‌ నిర్వహించాలని, దీనిపై ఎన్‌ఎంసీ ఎప్పుడైనా తనిఖీలు చేస్తుందని పేర్కొంది. దరఖాస్తు అనంతరం వార్షిక తనిఖీలకు రూ.3 లక్షలు, గుర్తింపు కోసం మరో రూ.3 లక్షలు చెల్లించాలి. ఇది ఏటా చెల్లించాల్సి ఉంటుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారనుందని వైద్య విద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 04:05 AM