NIT Warangal secured Top offers: నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ!
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:30 AM
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ప్లేస్‌మెంట్స్‌లో దూసుకుపోతోంది. 2025-26 ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభ దశలోనే రికార్డు స్థాయిలో...
మరొకరికి రూ.కోటి.. ఎంఎన్‌సీల ఆఫర్లు.. రెండు నెలల్లో 528 మందికి ప్లేస్‌మెంట్స్
హనుమకొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ప్లేస్‌మెంట్స్‌లో దూసుకుపోతోంది. 2025-26 ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభ దశలోనే రికార్డు స్థాయిలో అద్భుత ఫలితాలను సాధించింది. ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే 528 మంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్లు పొందారు. వరంగల్ ఎన్‌ఐటీ చరిత్రలో మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్ధి నారాయణ త్యాగి (నోయిడా, ఉత్తరప్రదేశ్) బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సీటీసీ (కాస్ట్ టూ కంపెనీ)తో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మరో విద్యార్థి మహమ్మద్ నహిల్ నష్వాన్ (ఖమ్మం) రూ.1 కోటి సీటీసీ తో దేశీయ ఆఫర్‌ను పొందారు. 2025-26 ప్లేస్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే రూ.70లక్షలకుపైగా సీటీసీతో ఆరుగురు, రూ.50లక్షలకుపైగా సీటీసీతో 34మంది, రూ.30 లక్షలకుపైగా సీటీసీతో 125మంది, రూ. 25 లక్షలకుపై సీటీసీతో 200మంది విద్యార్థులు ఆఫర్లు పొందారు. గత నెల 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటింది. ప్లేస్‌మెంట్ సీజన్ కొనసాగుతూనే ఉంది. ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి ప్లేస్‌మెంట్ పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
’ప్లేస్‌మెంట్ సెల్‌కు రుణపడి ఉంటా
‘నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా. ఇంజనీర్ల కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ సోనియా త్యాగి కెమిస్ట్రీ టీచర్. నాన్న వికాస్ త్యాగి ఇంజనీర్. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పాటు చిన్నతనం నుంచి గేమింగ్, సాంకేతికతపై ఉన్న ఆసక్తితో బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. మంచి ప్లేస్‌మెంట్ సాధించడంలో సహకరించిన వరంగల్ ఎన్‌ఐటీ ప్లేస్‌మెంట్ సెల్‌కు రుణపడి ఉంటాను’
- నారాయణ త్యాగి
తల్లిదండ్రుల త్యాగాలతోనే..
‘నా న్వస్థలం ఖమ్మం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న మహ్మద్ నజీర్ అకౌంటెంట్. మా అమ్మ నిఖత్ షహీన్ గృహిణి. మా తల్లిదండ్రులు నా కోసం చేసిన అపూర్వవైన త్యాగాలు నన్ను ఈరోజు ఇలా ఉన్నతి స్థితిలో నిలబెట్టాయి. నిరంతర అధ్యయనంతో కొత్త సవాళ్లను స్వీకరిస్తా. నా దృష్టి పరిధిని విస్తరించుకుంటా’
- మహమ్మద్ నహిల్ నష్వాన్