Nirmala Jagga: వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి అభ్యర్థి నిర్మల
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:30 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ వర్కింగ్...
ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను
దసరా వేడుకల వేదిక నుంచే స్పష్టతిస్తున్నా
3సార్లు గెలిపించిన ప్రజలకు శక్తి కొద్దీ చేశా
పదేళ్ల తర్వాత ఇక్కడి నుంచి పోటీ: జగ్గారెడ్డి
సంగారెడ్డి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి కూన సంతోష్ అని ప్రకటన
సంగారెడ్డిలోని అంబేడ్కర్ గ్రౌండ్స్‌లో ఘనంగా దసరా వేడుకలు
సంగారెడ్డి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్‌లో గురువారం దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పనులూ చేయిస్తానని హామీ ఇచ్చారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తన శక్తి కొద్దీ వారికి అన్నీ చేశానని గుర్తు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్మలకే అప్పగిస్తున్నానని అన్నారు. దసరా వేడుకల వేదికపై నుంచే ఈ మేరకు స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక, సంగారెడ్డి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని వెల్లడించారు. కాగా, గంజాయి, డ్రగ్స్, మద్యం బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. వాహనాలు అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావొద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దని పిలుపునిచ్చారు.