Critical Care Blocks: 9 సీసీబీలు సిద్ధం
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:32 AM
అధునాతన వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9 చోట్ల క్రిటికల్ కేర్ బ్లాకుల (సీసీబీ)ను అందుబాటులోకి తీసుకురాబోతోంది...
పది రోజుల్లో అందుబాటులోకి..
ఒక్కోచోట 50 పడకలతో ఏర్పాటు
అధునాతన వైద్య సేవలు, సర్జరీలు
అత్యవసర కేసుల్లో మెరుగైన చికిత్స
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అధునాతన వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9 చోట్ల క్రిటికల్ కేర్ బ్లాకుల (సీసీబీ)ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వారం పది రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీబీల నిర్మాణం పూర్తైనట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వెంటనే వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగాం, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం సీసీబీల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 చోట్ల సీసీబీలు నిర్మిస్తోంది. వీటిని ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం అభిమ్) కింద చేపట్టారు. మొత్తం రూ.769.75 కోట్లు కేటాయించారు. 29 కేంద్రాలను 50 పడకలతో, మరో రెండు కేంద్రాలను వంద పడకలతో ఏర్పాటు చేస్తున్నారు. 50 పడకల కేంద్రాలు ఒక్కోదాన్ని (45 వేల చదరపు అడుగుల విస్తీర్ణం) రూ.23.75 కోట్లతో, వంద పడకల కేంద్రాలను ఒక్కోదాన్ని (92 వేల చదరపు అడుగుల విస్తీర్ణం) రూ.40.5 కోట్లతో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో వంద పడకల సీసీబీఎ్‌సలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండూ వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 5 లక్షల జనాభా దాటిన ప్రతి జిల్లాలో పీఎమ్-అభిమ్ కింద సీసీబీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 మధ్యకాలంలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీసీబీల ఏర్పాటుకు 60 శాతం నిధులను కేంద్రం అందిస్తుండగా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
ఏ వైద్య సేవలంటే..
50 పడకల సీసీబీల్లో 10 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) పడకలు ఉంటాయి. ఆరు హై డిపెండెన్సీ యూనిట్లు (హెచ్‌డీయూలు), 24 ఐసోలేషన్ బెడ్‌లు, 4 ఎమర్జెన్సీ బెడ్‌లు, రెండు ఐసోలేషన్ గదులు ఉంటాయి. రెండు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, మరో రెండు లేబర్ డెలివరీ రికవరీ (ఎల్‌డీఆర్) గదులు, ఇంకో రెండు డయాలసిస్ బెడ్‌లు, ఒక డెడికేటెడ్ ల్యాబ్, ఆక్సిజన్ సరఫరా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఆర్థోపెడిక్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్లు, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, మత్తుమందు వైద్యుడు, ఇతర సిబ్బంది ఉంటారు. సీసీబీలకు వైద్య సిబ్బందిని తాత్కాలికంగా సమీప బోధనాస్పత్రుల నుంచి నియమిస్తున్నారు. తర్వాత శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. సీసీబీల్లో యాక్సిడెంట్ కేసులతో పాటు ఇతర ఎమర్జెన్సీ కేసులకు వైద్య సేవలు అందిస్తారని ఆ అధికారి తెలిపారు.