Share News

NIMS hospital Tragedy: రాత్రి స్టోర్‌ రూమ్‌కి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమయ్యాడు!

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:29 AM

ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది...

NIMS hospital Tragedy: రాత్రి స్టోర్‌ రూమ్‌కి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమయ్యాడు!

  • నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

  • ఆస్పత్రిలో అనస్థీషియాలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న నితిన్‌

  • సమగ్ర విచారణ జరపాలి.. మృతుడి సోదరుడి డిమాండ్‌

నిమ్స్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా.. కుటుంబసభ్యులు, సహచర విద్యార్థులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా కొల్చా మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్‌ లక్ష్మణ్‌, అమ్సి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నితిన్‌(21) నిమ్స్‌ ఆస్పత్రిలో మూడేళ్ల అనస్థీషియా కోర్సు పూర్తిచేశారు. బోరబండలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉంటూ నిమ్స్‌ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. ఆయన ఇంటర్న్‌షిప్‌ వచ్చే జనవరితో ముగియనుంది. గురువారం ఉదయం 8 గంటలకు విధులకు హాజరయ్యారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఆయన విధుల్లో ఉండాలి. గురువారం రాత్రి 11.30 గంటలకు నితిన్‌ సీనియర్‌ టెక్నీషియన్‌ నరేశ్‌కు ఫోన్‌ చేశారు. అతను వచ్చాక, పడుకోమని చెప్పడంతో నితిన్‌ స్టోర్‌రూమ్‌కు వెళ్లారు. లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో శుక్రవారం ఉదయం స్టోర్‌ రూమ్‌ను శుభ్రం చేయాడానికి వెళ్లిన సిబ్బంది తలుపు తట్టగా నితిన్‌ తీయలేదు. గట్టిగా తలుపు నెట్టి, చూడగా.. నితిన్‌ చలనం లేకుండా కనిపించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది వెళ్లి, సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయిందని ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు తెలిపారు. అయితే నితిన్‌ స్టోర్‌ రూమ్‌కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ, నితన్‌ మృతికి కారణాలు తెలియవని అధికారులు చెబుతున్నారు.

మృతిపై అనుమానాలు..!

కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి, కన్నీరుమున్నీరుగా విలపించారు. హాస్టల్‌లో ఉండే నితిన్‌ స్నేహితులు కొందరు నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చి.. ‘ఇది ఆత్మహత్య కాదు. ఎవరో చంపేసి ఉంటారు’ అని అనుమానం వ్యక్తం చేశారు. నితిన్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలని అతని సోదరుడు పవన్‌ పోలీసులను కోరారు. కాగా, నితిన్‌తో పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులు మాట్లాడుతూ.. తమకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అనస్థీషియాలో మాత్రమే 24 గంటల పని విధానం ఉందన్నారు. నితిన్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. నితిన్‌ మృతి చెందిన స్టోర్‌ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కనిపించలేదని చెప్పారు.

Updated Date - Oct 18 , 2025 | 05:29 AM