Share News

Nigerian Drug: నైజీరియా డ్రగ్స్‌ వయా యూరప్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:05 AM

నైజీరియా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. అయితే స్మగ్లర్లు వాటిని నేరుగా భారత్‌కు పంపించకుండా..

Nigerian Drug: నైజీరియా డ్రగ్స్‌ వయా యూరప్‌

  • కొరియర్‌ ద్వారా భారత్‌కు చేరవేత

  • ఈగల్‌ బృందాల దాడుల్లో వెల్లడి

  • దేశవ్యాప్తంగా 24 చోట్ల దాడులు

  • 20 మంది హవాలా ఆపరేటర్ల అరెస్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నైజీరియా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. అయితే స్మగ్లర్లు వాటిని నేరుగా భారత్‌కు పంపించకుండా.. సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నైజీరియా నుంచి తొలుత యూర్‌పకు పంపించి.. అక్కడి నుంచి ఫెడెక్స్‌, డీహెచ్‌ఎల్‌ వంటి కొరియర్ల ద్వారా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చేరవే స్తున్నారు. రాచకొండ ఈగల్‌ బృందాలు ఇటీవల అరెస్టు చేసిన నైజీరియా దేశస్తుడు కెన్నత్‌ మ్యాక్స్‌వెల్‌ డ్రగ్స్‌ లింకులపై జరిపిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈగల్‌ బృందాలు దేశవ్యాప్తంగా 24 చోట్ల దాడులు నిర్వహించి.. 20 మంది హవాలా ఆపరేటర్లను అరెస్టు చేశాయి. రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఈగల్‌ బృందాలు దాడి చేశాయి. యూరప్‌ నుంచి కొరియర్‌ కంపెనీల ద్వారా ముంబై, పుణె చేరిన 35 డ్రగ్స్‌ పార్సిళ్ల ఇన్వాయి్‌సలను గుర్తించాయి. ముంబై, పుణె నుంచి స్థానిక కొరియర్‌ కంపెనీల ద్వారా డ్రగ్స్‌ గోవాకు చేరుతుండగా, అక్కడి నుంచి హైదరాబాద్‌కు మ్యాక్స్‌వెల్‌ ముఠా పంపినట్లు ఈగల్‌ బృందాల దర్యాప్తులో వెల్లడైంది. కాగా, డ్రగ్స్‌ సరఫరాదారులు వాటి అమ్మకాలతో వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించి, ఆ డబ్బుతో వస్తువులను కొనుగోలు చేసి నైజీరియాకు పంపుతున్నట్లు గుర్తించామని ఈగల్‌ డైరక్టర్‌ సందీప్‌ శాండిల్య ఒక ప్రకటనలో తెలిపారు. 50 మంది హవాలా ఆపరేటర్లను గుర్తించి.. 20 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల మ్యాక్స్‌వెల్‌ను అరెస్టు చేశాక.. అతనికి సంబంధించిన 150 నగదు లావాదేవీలను గుర్తించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే మత్తుమందుల అమ్మకాల ద్వారా తనకు వచ్చే 20ు కమిషన్‌ కింద మ్యాక్స్‌వెల్‌ రూ.68 లక్షలు సంపాదించినట్లు కనుగొన్నారు.


వస్తువులు కొనుగోలు చేసి నైజీరియాకు..

నైజీరియన్ల నుంచి హవాలా ఆపరేటర్లయిన ఉత్తమ్‌సింగ్‌, చేతన్‌ మమానియా, దుర్గారామ్‌, చేతన్‌సింగ్‌, చగన్‌లాల్‌కు డ్రగ్స్‌ అమ్మకాల డబ్బు అందేది. నైజీరియన్లు తమకు అందిన డబ్బును ప్రధాన హవాలా ఆపరేటర్లకు పంపించి.. తమకు ఏ వస్తువులు కావాలో తెలియజేసేవారు. ప్రధానంగా వస్ర్తాలు, బేబీ ఫ్రాక్స్‌, టీ షర్టులు, కుర్తాలు, కేశాలు కొనుగోలు చేసి.. వాటిని సముద్ర మార్గం ద్వారా కార్గోలో నైజీరియాకు పంపించాలని హవాలా ఆపరేటర్లను కోరేవారు. ఈ క్రమంలో హవాలా ఆపరేటర్లు దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించి నైజీరియన్లు కోరిన వస్తువులను వారి దేశానికి పంపించేవారు. గోవాలోని హవాలా ఆపరేటర్‌ ఉత్తమ్‌సింగ్‌కు మత్తుమందుల అమ్మకాలకు సంబంధించి నైజీరియన్ల నుంచి రోజుకు రూ.25 లక్షల నగదు అందుతుంది. ఇలా వారానికి రూ.2.1 కోట్ల నగదును గోవాలోని వ్యాపారులు, హవాలా ఆపరేటర్ల ద్వారా ఉత్తమ్‌సింగ్‌ మార్పిడి చేసేవాడు. అతని నుంచి చేతన్‌సింగ్‌కు, అక్కడి నుంచి భరత్‌కుమార్‌కు చేరి.. ముంబై, సూరత్‌లో కొనుగోళ్లు జరిపేవారని సందీప్‌ శాండిల్య వివరించారు. ఇది కేవలం మ్యాక్స్‌వెల్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌పై జరిపిన దాడుల్లోనే తేలిన విషయమని, దేశవ్యాప్తంగా పలువురు నైజీరియన్లు మత్తుమందుల దందాలో ఉండటంతో.. ఇంకా ఎంత పెద్దమొత్తంలో హవాలా మార్గంలో నగదు చెలామణి అవుతుందో గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 05:05 AM