NIA Arrests Gade Innayya: గాదె ఇన్నయ్య అరెస్ట్
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:05 AM
జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం రేగడితండా పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ మావోయిస్టు నాయకుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ...
జఫర్‌గడ్ ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ.. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని నోటీసులు
ఉపా చట్టం కింద కేసు.. నాంపల్లి కోర్టులో హాజరు..14 రోజుల రిమాండ్
జఫర్‌గడ్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం రేగడితండా పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ మావోయిస్టు నాయకుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబరులో ఛత్తీ్‌సగఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నారెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఓ ఛానల్‌తో మాట్లాడిన ఆయన.. మావోయిస్టులకు, వారి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలతో పాటు సంస్మరణ సభలో పాల్గొనడం, నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు, వారి ఉద్యమాన్ని ప్రోత్సహించేలా మాట్లాడటం, విప్లవాన్ని ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇన్నయ్య ఆశ్రమానికి వచ్చిన పోలీసులు ఆయా అంశాలకు సంబంధించి సుమారు గంటకు పైగా ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. ఇన్నయ్య నుంచి రెండు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులను స్వాఽధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా, జఫర్‌గడ్ మండలం సాగరంనకు చెందిన ఇన్నయ్య గతంలో కొన్నేళ్ల పాటు మావోయిస్టు ఉద్యమ నేతగా పని చేశారు. జన జీవనంలోకి వచ్చాక ఇన్నయ్య-పుష్పారాణి దంపతులు 2006లో సాగరం క్రాస్ వద్ద మా ఇల్లు ప్రజాదరణ పేరుతో ఆశ్రమం స్థాపించారు. సుమారు రెండు దశాబ్దాలుగా అనాథలు, నిరుపేద పిల్లలను ఆశ్రమంలో చేర్చుకుని వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు.
ఇన్నయ్యను విడుదల చేయాలి
గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విమర్శించినందుకే కక్షగట్టారని పేర్కొంది. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణచివేస్తూ అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగవిరుద్ధమని టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామిరెడ్డి, తెలంగాణ కళాకారుల వేదిక అధ్యక్షుడు పెద్ద యాదగిరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యవాదులపై ఉపా చట్టం ప్రయోగించి అరెస్టులు చేస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గాదె ఇన్నయ్య, మరికొందరిపై ఉపా చట్టం అమలు చేసి అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు.
అరె్‌స్టకు దారి తీసిన వ్యాఖ్యలు..
కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు నేతలపై గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌లు మరోసారి తెరవైకి వచ్చాయి. ‘‘మోదీ, అమిత్‌షా.. మీరు ఏం సాధిద్దామని రామచంద్రారెడ్డిని అతి కిరాతంగా చంపేశారు..? పిరికి పందల్లా చంపడం గొప్ప అనుకుంటున్నారా..? మీ కాళ్ల దగ్గర తుపాకులను పెట్టిన వాళ్ల నుంచి సమాచారం తీసుకుని రామచంద్రారెడ్డిని చంపేశారు. మోదీ, షా.. మీకు దమ్ము, సిగ్గు, శరం ఉంటే ఛత్తీ్‌సగడ్‌లో ఐదో షెడ్యూల్‌ను అమలు చేయండి. పాలకులకు విప్లవ ద్రోహులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు’’ అంటూ ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు దారి తీశాయని తెలుస్తోంది.