Share News

TPCC to Fill Nominated Posts: నెలాఖరు కల్లా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:18 AM

ఈ నెలాఖరుకల్లా వివిధ కార్పొరేషన్లు, బోర్డుల చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు...

TPCC to Fill Nominated Posts: నెలాఖరు కల్లా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

  • కొత్త వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ కూడా

  • ఫ్యూచర్‌ సిటీలో పార్టీ కోసం స్థలం

  • సీఎంతో విభేదాల్లేవ్‌: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరుకల్లా వివిధ కార్పొరేషన్లు, బోర్డుల చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. టీపీసీసీకి కొత్త వర్కిగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీని అధిష్ఠానం నియమిస్తుందని చెప్పారు. సీఎల్పీలో బుధవారం మహేశ్‌ గౌడ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావడం చూసి హరీశ్‌రావుకు గుబులు పుట్టిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఆయన చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ దశాబ్ద ఏలుబడి కంటే కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో నాలుగింతల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు గ్లోబల్‌ సమ్మిట్‌ కొత్త దిశను చూపిందని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో కాంగ్రెస్‌ పార్టీ కోసం స్థలం తీసుకుంటామని చెప్పారు. ఆస్తులకు సంబంధించిన లావాదేవాల వల్లనే ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారని, అయితే ఆమె విమర్శల వల్ల బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన దోపిడీలు బయటికి వస్తున్నాయని పేర్కొన్నారు. కవిత లూటీ వ్యాఖ్యలపైన విచారణ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరతానని చెప్పారు. తెలంగాణకు భవిష్యత్తులో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలన్నది తమ ఆకాంక్ష అని, అది కాంగ్రెస్‌ నేతృత్వంలోనే జరుగుతుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య అంతరం ఏర్పడిందన్నది అసత్య ప్రచారమని మహేశ్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Dec 11 , 2025 | 05:18 AM