Share News

Mahatma Gandhi National Employment Guarantee: ఏప్రిల్‌ నుంచి జీరామ్‌జీ!

ABN , Publish Date - Dec 29 , 2025 | 02:09 AM

దేశంలో పేదలకు ఉపాధి హామీకి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌.....

Mahatma Gandhi National Employment Guarantee: ఏప్రిల్‌ నుంచి జీరామ్‌జీ!

  • పాత ‘ఉపాధి’ చట్టం కటాఫ్‌ తేదీపై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్‌

  • చట్టం అమలుకు రాష్ట్రాలు బిల్లు ఆమోదించుకోవాలి.. 40ు వాటా భరించాల్సి రావడమే కారణం

  • వీబీ జీరామ్‌జీపై ప్రతిపక్షాల పోరు ఫలిస్తుందా?.. కేంద్రం వెనక్కి తగ్గుతుందా.. లేక ముందుకేనా?

  • కొత్త పథకంలో ఇప్పటి జోరుతో పనులు సాగేనా?.. రాష్ట్రాలను, లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్నలెన్నో!

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో పేదలకు ఉపాధి హామీకి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ-జీరామ్‌జీ)’ 2026 ఏప్రిల్‌ నుంచే అమల్లోకి రానుంది. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ చట్టంలో.. రాష్ట్రాలు ఆరునెలల్లోపు దీని అమలుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. కానీ పాత ఉపాధి హామీ పథకం కింద పనులను ఎప్పటివరకు కొనసాగించవచ్చు? కొత్త నిబంధనల మేరకు పనులు ఎప్పటి నుంచి చేపట్టాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాతచట్టం కింద పనులను నిలిపేయాల్సిన తేదీ 2026 మార్చి 31గా ఉండవచ్చని పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కొత్త వీబీ-జీరామ్‌ జీ నిబంధనల ప్రకారమే పనులు జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

వ్యతిరేకిస్తున్నా.. ముందుకు వెళ్లాల్సిందేనా?

వీబీ జీరామ్‌జీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు పోరాటం కూడా మొదలుపెట్టాయి. అయితే రాష్ట్రాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే.. కొత్త చట్టం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త చట్టం ఆధారంగా రాష్ట్రంలో అమలుచేసే పథకం, విధి విధానాలు, నిధుల కేటాయింపు తదితర అంశాలతో బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త చట్టంతో ఉపాధి వేతన నిధుల్లో 40శాతం భరించాల్సి రావడంతో.. రాష్ట్రాలు ఇంతకుముందులా ఉత్సాహంగా పనులు చేస్తాయా? అందుకు ఎన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం కోసం ఖర్చు చేసే మొత్తం, ఉపాధి కల్పించే రోజులు, జరిగే పనులు తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి హామీతో కూలీలకు డిమాండ్‌ పెరిగి.. పురుషులు, మహిళలకు సమాన వేతనం అందే పరిస్థితి ఏర్పడింది. కొత్త చట్టం వల్ల పనిదినాలు తగ్గిపోతే.. మహిళలకు వేతనాల విషయంలో వ్యత్యాసం పెరిగే ప్రమాదమూ ఉందన్న అభిప్రాయం వస్తోంది.


ఉప్పెనలా పాత ‘ఉపాధి’.. 266రకాల పనులు

ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో పనులు ఉప్పెనలా సాగాయి. కచ్చితమైన పరిమితేమీ లేకుండా అవసరమైన వారందరికీ పని కల్పించాల్సి రావడం, వారికి ఇచ్చే వేతనాల్లో 90శాతం కేంద్రమే భరించడంతో రాష్ట్రాలు ఈ పథకం అమల్లో పోటీపడ్డాయి. ఆ చట్టం కింద తొలుత అనుమతించిన పనులేకాకుండా.. పథకానికి అనుసంధానంగా ఉండేలా పలు కొత్త పథకాలు, పనులను రూపొందించుకున్నాయి. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం ప్రారంభంలో నీటి నిర్వహణ పనులు ప్రభుత్వ, అటవీ, సామాజిక భూములకే పరిమితం. తర్వాత క్రమంగా చిన్న, సన్నకారు రైతుల భూముల్లో ఫారం పాండ్ల్ల నిర్మాణం, భూమి చదును కార్యక్రమం, గట్ల నిర్మాణం వంటి పనులనూ చేర్చారు. ఉపాధి హామీతో అనుసంధానం చేసుకుని రైతుల భూముల్లో పండ్ల తోటల పెంపకానికి ఉద్యానవన శాఖ ఒక పథకం ప్రారంభించింది. ఇక తొలుత గ్రామీణ లింకురోడ్లకు మాత్రమే ఉపాధి హామీలో అనుమతి ఉంటే క్రమంగా సిమెంటు రోడ్లకు కూడా అనుమతి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా సమాఖ్యల భవనాలను కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసుకుని, నిర్మించేలా ఏర్పాట్లు చేసింది. ఇలా రాష్ట్రంలో సుమారు 266 రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానమై ఉన్నాయి. కొత్త చట్టంతో అవన్నీ నీరసపడే అవకాశం కనిపిస్తోంది.

90శాతం సొమ్ము మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకే..

పాత ఉపాధి హామీ (ఎంజీ నరేగా) పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని.. పూడిక తీసిన చెరువులోనే మళ్లీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక చర్చలు జరిగాయి. ఒకసారి కేరళ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (కిలా - ఇది పంచాయతీరాజ్‌ పాలనపై శిక్షణ ఇచ్చే కేరళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ) చర్చలో.. సరైన పనులపై వ్యయం జరగడం లేదని, నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగడం లేదనే ప్రస్తావన వచ్చింది. దీనికి అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, తన పదవీకాలం మొత్తం గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ శాఖల్లోనే పనిచేసిన ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఎం.విజయానంద్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘ఉపాధి హామీ పథకం నిధుల్లో అత్యధికం చెల్లించేది వేతనాల కిందే. ఆ మొత్తం వెళ్లేది గ్రామాల్లోకే. వాళ్లేమీ ఆ డబ్బును ఇళ్లలో దాచిపెట్టుకోరు. 90శాతం సొమ్మును బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. అంటే ఆ 90శాతం సొమ్ము తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేస్తుంది. పారిశ్రామిక రంగం, సేవల రంగం పనిచేయడానికి.. మొత్తంగా ఆర్థిక రంగం మందగమనంలోకి వెళ్లకుండా ఇది ఉపకరిస్తుంది’’ అని విజయానంద్‌ చెప్పడం గమనార్హం.


తెలంగాణలో అనేక లక్ష్యాల సాధనకు ఉపాధి ఊతం.. మరి ఇకపై?

ఉపాధి హామీ పథకంలో నాణ్యమైన పనులు కూడా చాలా జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే దాదాపు అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేశారు. 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాన్ని సాధించగలిగారు. అన్ని గ్రామాల్లోని చెరువుల్లోను పూడిక తీశారు. అప్పటివరకు కబ్జా కోరల్లోకి వెళ్లిన చెరువులు.. ఆ సమస్య నుంచి బయటపడేందుకూ ఇది తోడ్పడింది. చాలా గ్రామాల్లో చెరువు గట్లపై కొబ్బరి, ఇతర పండ్ల మొక్కలు కనిపిస్తున్నా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అక్కపల్లిగూడెం వంటి పంచాయతీలో 50 ఏళ్లు సాగులో లేని భూములను చదునుచేసి ఇప్పుడు సాగులోకి తెచ్చుకున్నా.. ఉపాధి హామీ పథకమే కారణం. వీబీ జీరామ్‌జీ చట్టంలో కూడా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణ పనులు, జీవనోపాఽధి పెంపు తదితర పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. కానీ అవి ఇప్పటివరకు జరిగిన స్థాయిలో ఉంటాయా అన్నది ప్రశ్నార్థకమే.

Updated Date - Dec 29 , 2025 | 02:09 AM