Share News

Teenmar Mallanna: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:03 AM

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న..

Teenmar Mallanna: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ

  • ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తీన్మార్‌ మల్లన్న

  • పార్టీ జెండా, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

  • ఇది బీసీల తలరాత మార్చే రోజు: మల్లన్న

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణ వేదికగా కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ)గా ప్రకటించిన ఆయన పార్టీ లక్ష్యాలను వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా టీఆర్‌పీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ గడ్డ మీద మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలు తమకు ఒక రాజకీయ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఈ రోజు చాలా మంచిరోజు కావడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను బీఫాంలు అడుక్కునే పరిస్థితి ఈ రోజుతో ముగిసిందన్నారు. రేపటి నుంచి బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 17కి ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పెరియార్‌, విశ్వకర్మల జయంతినాడే కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజును బీసీల తలరాత మార్చే రోజుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ అంటే పాన్‌ డబ్బా కాదని, బీసీల రాజ్యాధికారం కోసం పార్టీ పెడుతున్నామని చెప్పారు. దీని కోసం అందరూ కలిసి రావాలని కోరారు. తాను ఎమ్మెల్సీగా ఏమీ చేయలేదని ఎవరైనా చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీసీల కోసం పోరాడుతున్నానని అంటేనే ఎమ్మెల్సీగా ఉంటానన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను అసెంబ్లీలో కూర్చునేలా చేస్తానని చెప్పారు. టీఆర్‌పీ అధ్యక్షుడిగా తీన్మార్‌ మల్లన్న, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మాదం రజనీకుమార్‌ యాదవ్‌, సూదగాని హరిశంకర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్‌, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్‌ యాదవ్‌, జ్యోతి పండల్‌ ఎన్నికయ్యారు.

ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా

టీఆర్‌పీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండా పై భాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను రాశారు. పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును ముద్రించారు. బీసీ మేధావి నారగోని చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. ఆకుపచ్చ రంగు రైతులకు, ఎరుపు రంగు పోరాటానికి సూచన అని మల్లన్న చెప్పారు.

పార్టీ అధికార ప్రతినిధిగా ‘ఏఐ’

టీఆర్‌పీ అధికార ప్రతినిధిగా కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఎంచుకున్నట్లు తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. దేశంలో ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఏఐను ప్రకటించడం ఇదే మొట్టమొదటిసారి అని తీన్మార్‌ మల్లన్న చెప్పారు. పార్టీ వెబ్‌సైట్‌ ఆవిష్కరణను సభకు సాధారణ వ్యక్తిగా వచ్చిన యాదగిరి ముదిరాజ్‌తో చేయించారు.

Updated Date - Sep 18 , 2025 | 05:03 AM