DGP Shivadhar Reddy: ఆపదలో ఆదుకునే మిత్రుల్లా పోలీసులు!
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:40 AM
ప్రజలకు అనుకూలంగా, ఆపదలో ఆదుకునే మిత్రుల్లా పోలీసుల పనితీరు ఉండాలని నూతన డీజీపీగా నియమితులైన బత్తుల శివధర్‌రెడ్డి సూచించారు....
ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం
తప్పు చేసినవారికి శిక్షలు పడితేనే నేరస్థుల్లో భయం
పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు కోర్టుల ముందు ఉంచాలి
సివిల్ పంచాయితీలకు పాల్పడితే చర్యలు తప్పవు
సైబర్ నేరాల కట్టడికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలి.. పునరావాసం కల్పిస్తాం
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కాబోయే డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అనుకూలంగా, ఆపదలో ఆదుకునే మిత్రుల్లా పోలీసుల పనితీరు ఉండాలని నూతన డీజీపీగా నియమితులైన బత్తుల శివధర్‌రెడ్డి సూచించారు. పోలీసులను తమ స్నేహితులుగా ప్రజలు భావించేలా ఉండాలనేది తన లక్ష్యమని చెప్పారు. తప్పు చేసినవారికి సకాలంలో శిక్షలు పడితేనే.. నేరాలకు పాల్పడేవారిలో భయం పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న శివధర్‌రెడ్డి శనివారం ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి పోలీసు అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని కోరారు.
మహిళా భద్రత కోసం ఏం చేయబోతున్నారు?
రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికే గణనీయమైన కృషి చేసింది. బాధిత మహిళల్లో భరోసా కల్పించి, ధైర్యాన్ని ఇచ్చేలా పోలీసు చర్యలు ఉండాలని కోరుకుంటున్నా. మహిళలకు సంబంధించిన కేసులతోపాటు ఇతర క్రిమినల్ నేరాల్లో నేరస్తులకు సకాలంలో శిక్షలు పడితేనే బాధితులకు పోలీసు వ్యవస్ధ మీద నమ్మకం పెరుగుతుంది. దర్యాప్తు అధికారులు పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించి, కోర్టు ముందుంచి నేరగాళ్లకు శిక్షలు పడేలా చూడాలి.
పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి ఏం చేయనున్నారు?
సైబర్ నేరాలను కట్టడి చేయడానికి బహుముఖ వ్యూహం అవసరం. ఎక్కడో ఉండి, మరెక్కడో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి గోప్యతే కీలకం. ఆ గోప్యతను ఛేదించడం పోలీసుల ముందున్న ప్రధాన సవాల్. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. అదే స్థాయిలో పోలీసులకు సాంకేతిక అవగాహన కల్పిస్తున్నాం. సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చదువుకున్నవారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతుండటం ఆందోళనకరం.
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పై ఏం చర్యలు చేపడతారు?
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సమస్య ఒక్క పోలీసు విభాగంతోనే పరిష్కారం కాదు. వివిధ శాఖల అధికారులు కలిసి క్షేత్రస్ధాయిలో పర్యటిస్తూ సమస్యలు గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, టెలికం, వాటర్ బోర్డు, సాగునీటి శాఖల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. ఒకరు రోడ్డు వేస్తూ, మరొకరు గుంతలు తవ్వుతూ ఉంటే సమస్యలు పరిష్కారం కావు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా భాగస్వాములను చేస్తాం.
మావోయిస్టుల అంశంలో మీ వైఖరి?
వాస్తవంగా తెలంగాణలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారు 70 మంది వరకు ఉన్నారు. వారిలో పదిమందే తెలంగాణవారు. మిగతా ఇతర రాష్ట్రాల వారే. మేం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాం. మిగిలిన మవోయిస్టులంతా ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని గమనించి జనజీవన స్రవంతిలోకి రావాలి. వేధింపులు లేని జీవితం అందిస్తాం. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సోనూ రాసిన లేఖ ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందని స్పష్టమవుతోంది.
సివిల్ పంచాయితీలు చేసే పోలీసులపై చర్యలుంటాయా?
పోలీసుస్టేషన్లలో పంచాయితీలు ఉండవు. అలా సివిల్ పంచాయితీలకు పాల్పడేవారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. క్రమశిక్షణ గీత దాటితే వేటు తప్పదు. అది చిన్నవారైనా, పెద్దవారైనా సరే. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీసు స్టేషన్లకు రావొచ్చు. ప్రజలను వేధించాలని చూస్తే ఎవరినీ క్షమించేది లేదు.
షిఫ్టుల విధానాన్ని నిజాయితీగా అమలు చేయగలరా?
పోలీసులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తాం. హైదరాబాద్ వంటి చోట్ల పూర్తి స్థాయిలో ఏడాదంతా షిఫ్ట్ పద్ధ్దతి అమలు చేయడం వీలుకాదు. పండుగలు, ఆకస్మిక విపత్తులు వచ్చినపుడు షిప్టు పద్ధ్దతి అమలు చేయలేకపోతున్నాం. దీనిపై సమీక్షిస్తాం. పోలీసులకు కుటుంబంతో గడిపే అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తాం. పోలీసు కుటుంబాల సంక్షేమం మా ప్రధాన బాధ్యత కూడా.
మహిళా పోలీసులకు సరైన పోస్టింగ్‌లు లభిస్తున్నాయా?
దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉన్నారు. మహిళా పోలీసుల సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తాం. మహిళా పోలీసు అధికారులకు పురుష అధికారులతో సమానంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. స్టేషన్లలో అన్ని వసతులు కల్పిస్తాం. మహిళా పోలీసుల ఇబ్బందులు, సమస్యలపై ఫోన్ చేసినా, లేఖ రాసినా స్పందిస్తా. ప్రభుత్వం ఇప్పటికే మహిళా పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది. పాతబస్తీ వంటి కీలకమైన చోట మహిళా ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాం.