Share News

kumaram bheem asifabad- కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:21 PM

జిల్లాలోని పంచాయతీల్లో కొత్త సర్పం చ్‌లు కొలువుదీరారు. ఇటీవల పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పండుగ వాతావరణం మధ్య సోమవారం బాధ్యతలను స్వీకరించారు. దీంతో గ్రామ పాలన కొత్త పాలకవర్గాలచే షురూ అయింది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గా పరిధిలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు.

kumaram bheem asifabad- కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు
లోగో

- టపాసులు పేల్చుతూ..స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు

- పంచాయతీలకు కొత్త శోభ

- ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన

ఆసిఫాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పంచాయతీల్లో కొత్త సర్పం చ్‌లు కొలువుదీరారు. ఇటీవల పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పండుగ వాతావరణం మధ్య సోమవారం బాధ్యతలను స్వీకరించారు. దీంతో గ్రామ పాలన కొత్త పాలకవర్గాలచే షురూ అయింది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గా పరిధిలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో భాగంగా వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీప డ్డారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నారు. ఇందులో వాంకిడి మండలం తేజగూడ, ఆసిఫాబాద్‌ మండలం రహప ల్లి, చిలాటిగూడలలో సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. దీంతో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్‌లు గెలుపొందారు.

- భారీ ఏర్పాట్లు..

పంచాయతీల్లో నూతన పాలకవర్గాల సభ్యులు భా రీ ఏర్పాట్ల మధ్య బాధ్యతలను స్వీకరించారు. జిల్లాలో మూడు విడతలుగా 332 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడత డిసెంబరు 11వ తేదీన జరగగా, రెండో విడత డిసెంబరు 14వ తేదీన, మూడో విడత డిసెంబరు 17వ తేదీన నిర్వహించారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎన్నికలు ముగిసే వరకు కోడ్‌ను అమలులో ఉంచారు. ఈనెల 18వ తేదీ నుంచి కోడ్‌ను ఎత్తివేశారు. కొత్తగా ఎన్నికయిన సర్పంచ్‌లకు బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం సైతం ఆలస్యం చేయకుండా గెజిట్‌ జారీ చేసింది. దీంతో అన్ని గ్రామాల్లో కార్యదర్శులు, ప్రత్యేకాధికారుల సమక్షంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన సభ్యులందరికి సమాచారం అందించి బాధ్యతలను అప్పగించారు. ఉదయం 11 గంటల నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకున్నారు. వారి మద్దుతుదారులు స్వీట్లు పంచుతూ టపాసులు పేల్చుతూ సంబ రాలు నిర్వహించారు. కాగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసిం ది. నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో ప్రత్యేకాధికా రుల పాలన ఎత్తివేసినట్లయింది. పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికా రుల పాలన జరుగుతోంది. సుమారు ఇరవై రెండు నెలల పాటు అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన జరిగింది. ఎట్టకేలకు పంచాయతీలకు ఎన్నికలు జరిగిన కొత్త పాలకవర్గాలు కొలువు దీరడంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసినట్లయింది.

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ మండలంలోని 27 గ్రామపంచాయతీలకు గాను 25 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్లు అనుకులించకపోవడంతో రహపల్లి, చిలాటిగూడ సర్పంచ్‌ ఎన్నికలు జరుగలేదు. నూతనంగా ఎన్నికైన 25 మంది సర్పంచ్‌లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని సర్పంచ్‌ల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు అయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం అధికారులు నిర్వహించారు. 28 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను కేటాయించారు. ప్రత్యేక అధికారులు, సంబంధిత కార్యదర్శులు సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆయా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈసందర్భంగా పెద్దపెట్టున బాణా సంచాలను కాల్చారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గ్రామ పంచాయతీల్లో సోమ వారం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 26 పంచాయతీల్లో అధికారులు అట్టహాసంగా సర్పంచ్‌లకు, ఉపసర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. తేజాపూర్‌ పంచాయతీలో సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరుగక పోవడంతో అక్కడ కేవలం వార్డు సభ్యులకు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించా రు. కాగా వాంకిడి గ్రామ పంచాయతీలో సోమవారం జరిగిన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సర్పంచ్‌తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు గైర్హాజరైనారు. ఈ పంచా యతీలో 14 వార్డులకు గాను ఏడుగురు వార్డు సభ్యులు హాజరుకావడంతో ప్రత్యేక అధికారి శ్రావణ్‌కుమార్‌ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన సర్పంచ్‌తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు గైర్హాజరు కావడతో ఉన్నతాధికారుల ఆదేశాల మెరకు తిరిగి తేదీని నిర్ణయించి ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలిపారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పాలకవర్గాలు ఎట్టకేలకు సోమవారం కొలువుదీరాయి. మండలంలోని 22గ్రామపంచాయతీల్లో ఆయా పంచాయతీల ప్రత్యేకాధికారులు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ప్రమాణస్వీకారం అనంతరం వారందరిని శాలువాతో సత్కరించి సన్మానించారు. బెజ్జూరులో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌, మాజీ సర్పంచ్‌ కోండ్ర జగ్గాగౌడ్‌, నాయకులు నాహీర్‌అలీ, రామకృష్ణ, కొడప విశ్వేశ్వర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు డోకె వెంకన్న, నరేందర్‌గౌడ్‌, అమీరొద్దీన్‌, భషరత్‌ఖాన్‌, మహేష్‌ తదితరులు ఉన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి):గ్రామ పంచాయతీలకు ఇటీవల మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. మండలలోని 15 గ్రామ పంచాయితీల నూతన పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. లింగాపూర్‌ సర్పంచ్‌గా జాదవ్‌ రాజశేఖర్‌తో పాటు ఆయా గ్రామాల్లో గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలోని 24 పంచాయతీలలో సోమవారం సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు తదితరులుఉ పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి) (ఆంధ్రజ్యోతి): మండలంలోని 16 గ్రామపంచాయతీలలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు అయా గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాద్యతలు చేపట్టారు. సిర్పూర్‌(టి) మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వి నాగమణిని ప్రత్యేక అధికారి ఎంఈవో సదాశివుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈఓ తిరుపతి, బీజేపీ పార్టీ జిల్లా అద్యక్షులు శ్రీశైలం, నాయకులు డాక్టర్‌ శ్రీనివాస్‌, నానయ్య తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని 24 గ్రామపంచాయతీలలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు అయా గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాదికారులు, పంచాయతీ కార్యదర్శులు, అయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కౌటాల మండల కేంద్రంలో సర్పంచ్‌గా నక్క శంకర్‌, గుడ్లబోరిలో పెద్ది మంగ, గుండాయిపేటలో ఏలేకర్‌ సంతోష్‌తో పాటు మిగతా 17 గ్రామ పంచాయతీలలో సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని 29 గ్రామపంచాయతీలలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు అయా గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాద్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేకాదికారులు, పంచాయతీ కార్యదర్శులు, అయా పార్టీల నాయకులు అనిల్‌గౌడ్‌, సాగర్‌, వెంకటేశంగౌడ్‌, శ్రీనివాస్‌, గుణవంత్‌రావు, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:21 PM