kumaram bheem asifabad- ‘ఉపాధి’లో కొత్త నిబంధన
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:00 PM
ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధన అమలు చేస్తోంది. అదే ఈకేవైసీ విధానం. ఈ నిబంధన ప్రకారం ఉపాధి కూలీలు తమ పని ప్రదేశంలో ప్రతీ రోజు ఉదయం ఓసారి, సాయంత్రం 4 గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు
- ఉదయం, సాయంత్రం ఫొటోలు తీసి యాప్‌లో పెట్టాల్సిందే
- అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు
- పంద్రాగస్టు నుంచి అమలు
ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధన అమలు చేస్తోంది. అదే ఈకేవైసీ విధానం. ఈ నిబంధన ప్రకారం ఉపాధి కూలీలు తమ పని ప్రదేశంలో ప్రతీ రోజు ఉదయం ఓసారి, సాయంత్రం 4 గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
బెజ్జూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులకు వచ్చే కూలీల హాజరు నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. కాగా కొందరు నకిలీ ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నకిలీ హాజరుకు అడ్డుకట్ట వేసేందుకు ఈకేవైసీ విధానం అమల్లోకి తీసుకరావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కుమరం భీం ఆసిపాబాద్ జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు 1,23,000 ఉన్నాయి. కూలీల సంఖ్య 2,44,000, క్రియాశీలక యాక్టివ్ కార్డులు 89,000, పని చేస్తున్నవారు 1,65,845మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలు నకిలీ హాజరు నమోదు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. దీంతో పనులకు ఒకరికి బదులు మరొకరు హాజరైన ఘటనలతో పాటు ఒకరి ఫొటోలకు బదులుగా మరొకరి ఫొటోలు అప్‌లోడ్ చేసిన చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న నకిలీ హాజరు నమోదు ఘటనలపై సామాజిక తనిఖీల్లోనూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ మార్గాల్లో హాజరు వేసుకుని వేతనం పొందిన వారి నుంచి అధికారులు సొమ్ము రికవరీ చేస్తున్నట్లు సమాచారం. నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించేందుకు అమలు చేస్తున్న ఈజీఎస్ పనుల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎస్ యాప్ తీసుకవచ్చింది. అయితే ఈ యాప్‌ను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు కొందరు విధులకు గైర్హాజరైనా పాత పొటోలను అప్‌లోడ్ చేస్తూ తమ హాజరు నమోదు చేసుకున్న విషయం తెలిసందే. అదే తరహాలో కొందరు ఉపాధి కూలీల హాజరు నమోదు చేసుకున్నట్లు తుర్తించగా, కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు పనులకు హాజరు కాకపోయినా పనులకు వచ్చినట్లుగా యాప్‌లో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
15 నుంచి అమలులోకి..
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ హాజరు విధానం 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త హాజరు విధానం అమల్లోకి వస్తే నకిలీ హాజరు నమోదుకు అడ్డుకట్ట పడనుంది. అంతే కాకుండా వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత ఏర్పడనుంది. నిర్దేశించిన సమయం పని చేసిన కూలీలకే వేతనం లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ఉపాధిలో అక్రమాలు జరుగుతున్నాయని పలుసార్లు నిర్వహించిన సామాజిక తనిఖీల్లో వెల్లడైనా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోయారు. పని ప్రదేశంలో కూలీలు పని చేయకున్నా చేసినట్లు నమోదు చేసి అక్రమాలు చేశారు. అధికారులు కూడా కొందరు వారికి వంతు పలకడంతో ఉపాధిలో బారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి కొత్త విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. మొత్తానికి పని చేసిన కూలీలే వేతనాలు పొందే అవకాశం ఉంది.
ఉదయం, సాయంత్రం..
కొత్త విధానంలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలను ఫీల్డ్ అసిస్టెంట్లు రెండుసార్లు ఫొటోలు తీస్తారు. ఉదయం పనులకు హాజరయ్యేందుకు వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి, మరోసారి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఫొటో తీస్తారు. రెండుసార్లు తీసిన ఫొటోలు ఒకే మాదిరిగా ఉంటేనే ఆ కూలీకి వేతనం మంజూరవుతుంది. లేదంటే వేతనాన్ని నిలిపివేస్తారు. ఈ నెల 15నుంచి ఈకేవైసీ విధానం ద్వారా ఉపాధి హామీ కూలీల హాజరు నమోదు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కొత్త హాజరు విధానం అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో పథకం కూలీలకు ఈకేవైసీ విధానం ద్వారా హాజరు ఏ విధంగా నమోదు చేయాలనే విషయమై క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బందికి త్వరలోనే అవగాహన కల్పించనున్నారు.