Share News

CM K. Revant Reddy: రెండేళ్లలో ఉస్మానియా కొత్త ఆస్పత్రి పూర్తవ్వాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:11 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ...

CM K. Revant Reddy: రెండేళ్లలో ఉస్మానియా కొత్త ఆస్పత్రి పూర్తవ్వాలి

  • వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన

  • పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ

  • అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణంపై తన నివాసంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు జరిగే సమయంలో స్థానికులకు ఇబ్బందుల్లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అలాగే ఆస్పత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులకు సూచించారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి 10 రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాలను నిరంతరం ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు. వచ్చే జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, డీజీపీ శివధర్‌ రెడ్డి, హెల్త్‌ సెక్రటరీ క్రిస్టియానా జోంగ్తూ, ఇలంబర్తి, ముషారప్‌ అలీ ఫరూఖీ, హరిచందన డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 06:11 AM