Share News

Lack of Urban Planning: కొత్త మున్సిపాలిటీలకు ప్రణాళిక ఎట్లా?

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:27 AM

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 55 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తంగా మారుతోంది. పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీర్లు లేక....

Lack of Urban Planning: కొత్త మున్సిపాలిటీలకు ప్రణాళిక ఎట్లా?

  • 55 పురపాలికల్లో ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు లేరు

  • ఇతర పట్టణాల అధికారులకు బాధ్యతలు

  • పని ఒత్తిడితో తూతూమంత్రంగా విధులు

  • నిర్మాణ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం

  • ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీలు

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 55 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తంగా మారుతోంది. పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీర్లు లేక.. అభివృద్ధి, భవన అనుమతులు, లేఅవుట్‌ ఆమోదం వంటివి సమస్యగా మారాయి. పట్టణ ప్రణాళికకు సంబంధించి 390 పోస్టులు, ఇంజనీరింగ్‌ విభాగంలో 400 పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినా.. ఇంతవరకు ఆమోదం రాలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మున్సిపాలిటీలలో వారంలో మూడు రోజులు పనిచేసేలా ఓడీ పేరుతో సిబ్బందిని కేటాయిస్తున్నారని.. ఒక్కో పట్టణ ప్రణాళిక అధికారికి రెండు, మూడు మున్సిపాలిటీలు అప్పగించారని అంటున్నాయి. కానీ తీవ్ర పని ఒత్తిడితో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నాయి.

కోర్‌ అర్బన్‌ పరిధిలోనూ సమస్య..

హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉన్న పలు మున్సిపాలిటీలు సహా రాష్ట్రంలో 55 మున్సిపాలిటీలలో ఈ సమస్య నెలకొంది. కోర్‌ అర్బన్‌ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు పట్టణ ప్రణాళిక అధికారులు లేక.. అనధికారిక నిర్మాణాలు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం, మున్సిపల్‌ ఆదాయం తగ్గిపోవడం, అనుమతుల కోసం ప్రజలు రాష్ట్రస్థాయి అధికారులను సంప్రదించడం వంటివి జరుగుతున్నాయని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆదిభట్ల, ఆమన్‌గల్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీరు (మున్సిపల్‌ కార్పొరేషన్‌), ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, మణికొండ, మీర్‌పేట్‌, నార్సింగి, పెద్దఅంబర్‌పేట, శంషాబాద్‌, శంకరపల్లి, తుక్కుగూడ, తుర్కయాంజల్‌, కొత్తూరు, చేవెళ్ల, మొయినాబాద్‌ లాంటి కీలక మున్సిపాలిటీల్లోనూ రెగ్యులర్‌ పోస్టులు లేక ఓడీ ప్రాతిపదికన సిబ్బందిని కేటాయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని ప్రధాన పట్టణాలకు సమీపంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.


త్రిసభ్య కమిటీ దృష్టికి సమస్య..

కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీర్ల పోస్టులను మంజూరు చేయాలని పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై మాజీ సీఎస్‌ శాంతి కుమారి చైర్‌పర్సన్‌గా శివశంకరన్‌, సందీ్‌పకుమార్‌ సుల్తానియా సభ్యులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కోర్‌ అర్బన్‌ పరిధిలోని కీలక మున్సిపాలిటీల్లో వెంటనే పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.

Updated Date - Oct 09 , 2025 | 05:27 AM