New Mediccare Hospital Opens: మన చేతిలోనే మన ఆరోగ్యం
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:11 AM
మనం తినే ఆహారంలో రసాయనాలు చేరితే.. పీల్చేగాలి, తాగే నీరు కలుషితమవుతుందని, అందువల్లే రోగాల బారీన పడుతున్నామని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు..
మెడికవర్ సికింద్రాబాద్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
పేదలకు దయతో వైద్య సేవలు చేయండి: బండి సంజయ్
రోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోండి: రాష్ట్ర మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మనం తినే ఆహారంలో రసాయనాలు చేరితే.. పీల్చేగాలి, తాగే నీరు కలుషితమవుతుందని, అందువల్లే రోగాల బారీన పడుతున్నామని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూర్‌పలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూప్ సంస్థ ‘మెడికవర్’.. తెలంగాణలో 8వ హాస్పిటల్.. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. శారీరక శ్రమ తగ్గడం, జీవనశైలిలో మార్పుల వల్లే పలువురు వ్యాధుల భారీన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఇంటర్ వరకూ వైద్యుడ్ని చూసే అవకాశం రాలేదన్న కిషన్ రెడ్డి.. ప్రస్తుతం తల్లి గర్భంలోనే పిల్లలకు డాక్టర్ల సాయం అవసరమవుతుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలందిస్తున్నందున రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. రోగం కంటే ఆస్పత్రులు వేసే బిల్లులు చూసి పేదోళ్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కనుక ప్రేమతోనూ, దయతోనూ సేవలందించాలని వైద్యులను కోరారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విదేశాలతో పోలిస్తే మనదేశంలో వైద్యులను రోగులు నమ్ముతారని, దాన్ని నిలబెట్టుకునేలా సేవలందించాలన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణలా మార్చాలన్న పొన్నం ప్రభాకర్.. అందులో కార్పొరేట్ ఆస్పత్రులూ భాగస్వాములు కావాలని చెప్పారు. మెడికవర్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ జి. అనిల్ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో తమకిది ఎనిమిదో ఆస్పత్రి అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలందిస్తున్న తమ ఆస్పత్రి.. జిల్లాలకు సేవల విస్తరణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.శరత్ రెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.