Share News

New Liquor Shops: కొత్త మద్యం దుకాణాలు తొలిరోజే కిటకిట!

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:51 AM

రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు తొలిరోజే కళకళలాడాయి. దుకాణాలు దక్కించుకున్నవారు.. ఉదయమే దుకాణాలను అలంకరించి, పండితులను పిలిపించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో...

New Liquor Shops: కొత్త మద్యం దుకాణాలు తొలిరోజే కిటకిట!

  • ఉదయమే ప్రత్యేక పూజలతో యజమానుల హడావుడి

  • పలుచోట్ల స్థానికుల అభ్యంతరాలు, అద్దెకు షాపులు దొరక్క బ్రేక్‌

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు తొలిరోజే కళకళలాడాయి. దుకాణాలు దక్కించుకున్నవారు.. ఉదయమే దుకాణాలను అలంకరించి, పండితులను పిలిపించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో హడావుడి కనిపించింది. నిర్వాహకులు తమకు కలిసివచ్చే ముహూర్తం చూసుకుని షాపులు తెరిచి, విక్రయాలు మొదలుపెట్టారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ డిపోల నుంచి ఆదివారం అర్ధరాత్రి దాకా ఆయా మద్యం దుకాణాలకు సరుకు సరఫరా కావడంతో తొలి రోజే కొత్తస్టాక్‌తో విక్రయాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలుండగా.. ఈసారి చాలా మంది కొత్తవారు మద్యం వ్యాపారంలోకి దిగడంతో పూజలు, ముహూర్తాలపై మరింత శ్రద్ధ్దపెట్టినట్లు కనిపించింది. తొలిరోజే దుకాణాలు కిటకిటలాడాయి. ఇక హైదరాబాద్‌తో పాటు పలు జిల్లా కేంద్రా ల్లో ఈసారి చాలా మద్యం దుకాణాల్లో అనుబంధంగా వాకిన్‌ స్టోర్లను ఏర్పాటు చేశారు. సూపర్‌ మార్కెట్ల తరహాలో వినియోగదారులు వాటిలోపలికి వెళ్లి నచ్చిన మద్యాన్ని ఎంచుకుని కొనుగోలు చేయవచ్చు. లైసెన్సు ఫీజుకు అదనంగా రూ.5లక్షలు చెల్లించిన మద్యం దుకాణాలకు ఈ అవకాశం ఉంటుంది. నల్గొండలో గతంలో ఒకే వాకిన్‌ లిక్కర్‌ మార్ట్‌ ఉండగా.. సోమవారం కొత్తగా ఐదు ఏర్పాటయ్యాయి. ఈ కొత్త దుకాణాల పాలసీ గడువులో ప్రభుత్వానికి గతంలో కంటే భారీగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కొన్నిచోట్ల ఆగిన ప్రారంభం

కొత్త మద్యం దుకాణాలకు పలుచోట్ల స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రారంభం కాలేదు. దేవాలయాలు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాల్లో దుకాణాలు చేస్తుండటంపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. మరికొన్ని చోట్ల తగిన షాపులు అద్దెకు దొరక్కపోవడంతోనూ ప్రభావం పడింది. రంగారెడ్డి ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలో దాదాపు 25 దుకాణాలు సోమవారం ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటీరెండు చోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 04:51 AM