Share News

Minister Uttam Kumar Reddy: మళ్లీ సాగు నీటి సంఘాలు!

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:31 AM

చెరువులు, కాలువల నిరంతర నిర్వహణ, నీటి విడుదలపై పర్యవేక్షణ కోసం గతంలో మాదిరి సాగు నీటి వినియోగ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని...

Minister Uttam Kumar Reddy: మళ్లీ సాగు నీటి సంఘాలు!

  • తొలుత చెరువులు, కాలువలకు, ఆ తర్వాత భారీ ప్రాజెక్టులకు విస్తరణ

  • సంఘాల కింద లష్కర్‌ల విధులు

  • మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కాలువల నిరంతర నిర్వహణ, నీటి విడుదలపై పర్యవేక్షణ కోసం గతంలో మాదిరి సాగు నీటి వినియోగ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా చెరువుల, కాలువల కింద సంఘాలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత భారీ ప్రాజెక్టులకు విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. సాగు నీటి సంఘాల కింద లష్కర్‌లు పనిచేస్తారని, ఈ సంఘాలకు కన్వీనర్‌గా నీటిపారుదల శాఖ అధికారులు ఉంటారని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడటంతో పాటు సాగు నీటి అంశంలో ఏ అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేలా సాగునీటి సంఘాల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటు ఉంటుందన్నారు. 2018-19లో నీటి తీరువా రద్దు చేయడంతో సాగునీటి సంఘాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ఆ పర్యావసనాల ఫలితంగా తాజాగా సంభవించిన వరదల్లో చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణ వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి సిఫారసుల ప్రకారం సాగునీటి సంఘాలకు బాధ్యులను నామినేట్‌ చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు, చనాకా కొరాటా, మొడికుంటవాగు వంటి ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతి (ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌) తీసుకొని, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎ్‌సవై) కింద దరఖాస్తు చేయాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ తయారీలో జాప్యంపై అధికారులను మంత్రి నిలదీశారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు సంబంధించిన సవరణ అంచనాల ఫైలును నిబంధనల మేరకు సిద్ధం చేసి పంపించాలన్నారు. అలాగే చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజీ సవరణ అంచనాలపైనా ఆ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని చెప్పారు.


కేటీఆర్‌వి పిచ్చి మాటలు

కృష్ణా ట్రైబ్యునల్‌-2 (జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌) నీటి కేటాయింపులపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే ఉందని.. దీంతో ఆల్మట్టి ఎత్తు పెంచే అవకాశాల్లేవని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. మీడియా తో ఆయన చిట్‌చాట్‌ చేశారు. ప్రాజెక్టులపై కేటీఆర్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని ప్రకటించారు. కాగా, మంగళవారం ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఈ వానాకాలం సీజన్‌కుగాను 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతినిచ్చింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి, సేకరణ పెరుగుతున్న నేపథ్యంలో.. 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఉత్తమ్‌ కోరనున్నారు. 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం అప్పగింతకు అక్టోబరు 31 వరకే ఉన్న గడువును 3 నెలలు పొడిగించాలని కోరనున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 04:31 AM