Share News

VC Sajjanar: మహిళల భద్రతకు పెద్దపీట

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:31 AM

హైదరాబాద్‌ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని సిటీ నూతన పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. పోకిరీలు, ఆకతాయిలు..

VC Sajjanar: మహిళల భద్రతకు పెద్దపీట

  • అమ్మాయిల జోలికి వస్తే కఠిన చర్యలు.. వైట్‌ కాలర్‌ నేరగాళ్ల భరతం పడతాం

  • బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌పై ఉక్కుపాదం.. సైబర్‌ క్రైం, డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రత్యేక దృష్టి

  • ఆహార కల్తీని అరికడతాం

  • డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదకరం..ఉపేక్షించం: వీసీ సజ్జనార్‌

  • సిటీ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని సిటీ నూతన పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. పోకిరీలు, ఆకతాయిలు, అల్లరిమూకలు ఎవరైనా.. మహిళలు, అమ్మాయిల జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ సీపీగా మంగళవారం సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 18వ అంతస్తులో సీపీ కార్యాలయంలో పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీలు జితేందర్‌, శివధర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీస్‌ శాఖ అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ.. సరికొత్త ఏఐ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఆధునిక టెక్నాలజీతో పూర్తిస్థాయిలో నేరాలకు చెక్‌ పెట్టేవిధంగా ప్రణాళికను సిద్దం చేస్తామన్నారు. సిటీలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, నేరాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తానని సీపీ తెలిపారు. విజిబుల్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నేరస్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. భూ కబ్జాలు, దందాలు, మల్టీలెవల్‌ మోసాలతో అమాయకులను మోసం చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న ఆర్థిక నేరగాళ్ల భరతం పడతామని హెచ్చరించారు.


బెట్టింగ్‌ యాప్‌లపై కఠిన చర్యలు..

ప్రజలను పీడిస్తున్న బెట్టింగ్‌, గేమింగ్‌ లోన్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఉపేక్షించేది లేదని అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టిపెడతామని, ముఖ్యంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సిటీలో ఆహారకల్తీ అధికంగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై కల్తీ కేటుగాళ్ల ఆటలు సాగవని అన్నారు. ఇందుకోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌తోపాటు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌లను రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు. పోలీస్‌ అధికారుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని సీపీ తెలిపారు. పోలీస్‌ శాఖలో ఎంతో మంది అధికారులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని, అలాంటి అధికారులకు తగిన గుర్తింపుతోపాటు అవార్డులిచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. వారితోపాటు పోలీసులకు సహకరిస్తూ.. విలువైన సమాచారం అందజేసే ప్రజలను కూడా గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇక యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్లను కటకటాల్లోకి నెట్టి, దేశం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు.

Updated Date - Oct 01 , 2025 | 02:31 AM