Share News

Newly Constructed Hospital: కట్టేసి.. గాలికొదిలేసి..

ABN , Publish Date - Oct 07 , 2025 | 03:21 AM

మూడేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో వంద పడకలతో మధిర ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు. కానీ.. ఆ హాస్పిటల్‌కు వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను కొద్ది రోజుల క్రితం వరకు మంజూరు చేయలేదు...

Newly Constructed Hospital:  కట్టేసి.. గాలికొదిలేసి..

  • కొత్త దవాఖానాలకు మంజూరు కాని పోస్టులు

  • ఒక్క టీవీవీపీ పరిధిలోనే 25 ఆస్పత్రులు

  • ప్రజారోగ్యం పరిధిలో పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్స్‌

  • ఆర్థికశాఖ వద్ద ఫైలు.. వైద్యశాఖ అధికారుల చక్కర్లు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో వంద పడకలతో మధిర ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు. కానీ.. ఆ హాస్పిటల్‌కు వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను కొద్ది రోజుల క్రితం వరకు మంజూరు చేయలేదు. మూడేళ్లుగా ఆ ఆస్పత్రిని అలా ఖాళీగా వదిలేశారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కొత్తగా నిర్మించిన ఆ భవనంలోని కిటికీలు, తలుపులు పాడైపోతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రిదుస్థితి ఇది! అదొక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితే నెలకొంది. గణాంకాలు చూస్తే.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిఽధిలోనే 25 ఆస్పత్రులను కొత్తగా కట్టారు. వాటిలో ఏడు వంద పడకల ఆస్పత్రులు (మధిర, బెల్లంపల్లి,ఆర్మూర్‌, గజ్వేల్‌, బాన్స్‌వాడ, అలంపూర్‌, అచ్చంపేట, బాదేపల్లి(జడ్చర్ల)). మరో ఏడు చోట్ల 50 పడకల ఆస్పత్రులు, 11 చోట్ల 30 పడకల ఆస్పత్రులను కొత్తగా నిర్మించారు. కానీ.. సిబ్బంది లేకపోవడంతో వాటన్నింటినీ కొంత కాలంగా వాటిని నిరుపయోగంగా ఉంచారు. అలాగే రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడి పరిఽఽధిలో కొత్తగా పలుచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్ర భవనాలను నిర్మించారు. సిబ్బంది లేక వాటినీ ఖాళీగా ఉంచారు. కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలను కూడా ఇలాగే నిర్మించి, నిరుపయోగంగా ఉంచారు. ఇటువంటివి రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగానే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మధిర ఆస్పత్రికి తాజాగా కేడర్‌ స్ట్రెంత్‌ మంజూరైనప్పటికీ.. వైద్యుల నియామక ప్రక్రియ ప్రాసె్‌సలో ఉంది.


ఆర్థికశాఖ చుట్టూ ప్రదక్షిణలు

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని పాతిక ఆస్పత్రుల్లో కనీసం 1400 మంది సిబ్బంది అవసరమని వైద్య ఆరోగ్యశాఖ నిర్థారించింది. కొత్తగా నిర్మితమైన వాటిలో కనీసం తొలుత 1200 మంది వైద్య, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేయాలని కొద్ది నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ ఆర్థికశాఖను కోరింది. కానీ కొత్త పోస్టుల మంజూరు విషయంలో ఆర్థికశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. భవనాలు కట్టినా అవి ఖాళీగా ఉన్నాయని, పోస్టులు మంజూరు చేస్తే ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని హెల్త్‌ సెక్రటరీ పలుమార్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని స్వయంగా కలసి విజ్ఞప్తి కూడా చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

అదే అసలు సమస్య..

సాధారణంగా జనాభా అవసరాలకు తగినట్టుగా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. కానీ ఇటీవలికాలంలో ఆ ప్రాతిపదికన కాకుండా రాజకీయ పలుకుబడులతో ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తమ ప్రాంతాల్లో సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌ను మంజూరు చేయించుకుంటున్నారు. వెంటనే సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తోంది. అయితే అదే ఉత్తర్వ్యులల్లో ఆస్పత్రి ఏర్పాటుతో పాటు వైద్య సిబ్బందిని కూడా మంజూరు చేస్తే బాగుంటుంది. కానీ అలా జరగడం లేదు. దాంతో ఆస్పత్రుల నిర్మాణం పూర్తయినా సిబ్బంది లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 07 , 2025 | 03:21 AM