Share News

Joorala Dam: జూరాల డ్యామ్‌ దగ్గర కొత్త బ్రిడ్జి

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:00 AM

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్‌ దగ్గర కొత్త హై లెవల్‌ రోడ్‌ బ్రిడ్జి ....

Joorala Dam: జూరాల డ్యామ్‌ దగ్గర కొత్త బ్రిడ్జి

  • రూ.121 కోట్లతో నిర్మాణం

  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్‌ అండ్‌ బీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్‌ దగ్గర కొత్త హై లెవల్‌ రోడ్‌ బ్రిడ్జి (హెచ్‌ఎల్‌ఆర్‌బీ) నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీన్ని డ్యామ్‌కు కొంత దూరంలో.. జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామం వరకు నిర్మించాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.121.92 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్‌ జీవో నంబరు 408ను జారీ చేశారు. 10మీటర్ల వెడల్పు, ఫుట్‌పాత్‌తో బ్రిడ్జి, అప్రోచ్‌ రోడ్లు కలుపుకొని మొత్తం 10.5 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం జారాల ప్రాజెక్టుపై డ్యామ్‌ కమ్‌ రోడ్డు ఉంది. ఇటీవల డ్యామ్‌ భద్రత అధికారుల పరిశీలన అనంతరం డ్యామ్‌పై ట్రాఫిక్‌ అధికంగా ఉండడం, వాహనాల రాకపోకలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలుపుతూ ఆర్‌ అండ్‌ బీకి ఒక నివేదిక ఇచ్చారు. అందులో పలు సూచనలు చేశారు. దాని ప్రకారమే డ్యామ్‌కు కిలోమీటర్‌ దూరంలో మరో కొత్త బ్రిడ్జిని నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అప్పుడు.. గద్వాల జిల్లా ధరూర్‌ మండలం రేవులపల్లి నుంచి వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ పలు సర్వేల అనంతరం గద్వాల జిల్లాలోని కొత్తపల్లి నుంచి వనపర్తి జిల్లా లోని జూరాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. దీని ద్వారా గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు విస్తృతంగా ప్రయోజనం చేకూరడం, ప్రాజెక్ట్‌ పరిసర ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతోపాటు వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Sep 11 , 2025 | 05:00 AM