New Guidelines Issued for Temporary Transfers: ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గదర్శకాలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:18 AM
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గం సుగమమైంది. ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీ అయి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం...
జీవో 190 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే..
స్థానికతకు సంబంధించిన బదిలీలకు అనుమతి
గరిష్ఠంగా మూడేళ్లు.. ఆ తర్వాత పాత స్థానానికే
పదోన్నతులు, భాగస్వామి, మ్యూచువల్ విభాగాల్లో లబ్ధి పొందిన వారికి అవకాశం లేదు’
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గం సుగమమైంది. ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీ అయి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జీవో 317 ద్వారా ఒక జోన్ నుంచి మరో జోన్‌కు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో 190 విడుదల చేశారు. 2021 డిసెంబరులో ఇచ్చిన 317 ఉత్తర్వుల ప్రకారం కొంత మంది ఉద్యోగులను బలవంతంగా ఇతర జిల్లాలకు, ఇతర జోన్లకు బదిలీ చేశారనే అంశంపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతోంది. స్థానికత కోల్పోయామని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక, వారి సమస్యపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 2018లో ఇచ్చిన జీవో 124, 2021లో ఇచ్చిన జీవో 317, 2022లో ఇచ్చిన జీవో 46 ప్రకారం ఉద్యోగుల క్యాడర్ కేటాయింపులపై చాలా మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరి సమస్యలపై 2024లో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించేలా మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులతో ప్రభుత్వం తాజాగా జీవో 190 జారీ చేసింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన ఖాళీలు ఉంటే తాత్కాలిక బదిలీలకు, డిప్యుటేషన్లకు అనుమతించాలని ఆదేశించింది. ఈ బదిలీలు రెండేళ్ల కాలానికి అనుమతిస్తున్నామని, గరిష్ఠంగా మూడేళ్ల వరకు పొడిగించవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మూడేళ్లు ముగిసిన తర్వాత బదిలీ అయిన ఉద్యోగి తిరిగి తాను పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి ఒకసారి మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొనే ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం వర్తించదని జీవోలో పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీఏ, డీఏలు చెల్లించబోమని తెలిపింది. ఇప్పటికే పదోన్నతి పొందిన వారు, భాగస్వామి, పరస్పర అవగాహన విభాగాల్లో లబ్ధి పొందిన ఉద్యోగులు ఈ వెసులుబాటుకు అనర్హులని స్పష్టం చేసింది. కాగా, ఇది ఉద్యోగ సంఘాలు సాధించిన విజయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు పేర్కొన్నారు. ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలకు అనుమతివ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రివర్గ ఉపసంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.