Share News

NOTA Introduced in Panchayat Elections: పంచాయతీలోనూ నోటా

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:26 AM

రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్‌...

NOTA Introduced in Panchayat Elections: పంచాయతీలోనూ నోటా

  • తొలిసారి గ్రామీణ ఓటర్లకు అవకాశం.. టీఈ-పోల్‌ యాప్‌తో సమగ్ర సమాచారం

  • ప్రజల్లో విద్వేషాలు పెంచడమూ అవినీతే

  • అలాంటి వారు గెలిచినా సభ్యత్వం రద్దే!

  • ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల జైలు

  • ఎన్నికల సంఘం నిబంధనల్లో స్పష్టీకరణ

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ ఓటర్లకు ‘నన్‌ ఆఫ్‌ ద అబౌ(నోటా)’ అవకాశాన్ని కల్పిస్తున్నారు. బ్యాలెట్‌ పత్రంపై అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తును కూడా ముద్రిస్తున్నారు. అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసేందుకు సిద్ధంగా లేకపోతే ఓటరు నోటాకు వేయొచ్చు. అలాగే ఓటర్లకు సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) టీఈ-పోల్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, పోలింగ్‌ కేంద్రం చిరునామా తెలుసుకోవడం, పోలింగ్‌ ప్రక్రియపై ఫిర్యాదులు చేయడం, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించడం వంటివి చేయొచ్చు. ఎన్నికల నియమావళి ప్రకారం.. రాష్ట్ర మంత్రులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వస్తే అధికారిక వాహనాలు వాడరాదు. సొంత వాహనాలనే తీసుకెళ్లాలి. ప్రభుత్వ సిబ్బందిని సైతం వారితో తీసుకెళ్లకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచ్‌లు, ప్రభుత్వోద్యోగులు పోలింగ్‌ లేదా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రచారానికి వారం రోజులే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్దేశించిన సమయానికి 44 గంటల ముందు ప్రచారం ఆపేయాలని ఎస్‌ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం అభ్యర్థి, వారి తరఫున ఎవరైనా కులం, మతం, జాతి, వర్గం, భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఎస్‌ఈసీ నిబంధనల్లో పేర్కొంది. ప్రజల్లో విద్వేషాలు పెంచడాన్ని అవినీతి చర్యగానే పరిగణిస్తామని, విద్వేషాలతో రెచ్చగొట్టినవారు గెలిచినా వారి సభ్యత్వం రద్దు చేస్తామని వెల్లడించింది. దాన్ని ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది. ఓటర్లకు తాయిలాలు ఇవ్వజూపడం, బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించడం వంటివి చేయరాదు.


ముందస్తు అనుమతి ఉండాల్సిందే..

రాజకీయపార్టీల పరంగా అధికారంలో ఉన్నవారు తాము చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు హామీలు వంటి సందేశాలతో ప్రకటనలు ఇవ్వాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరని ఎస్‌ఈసీ తెలిపింది. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. రాష్ట్రస్థాయిలో అయితే సీఎస్‌ నేతృత్వంలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) కమిటీ, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ అనుమతి పొందాలి. ఇదిలా ఉంటే.. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు వంటివాటి ముద్రణపైనా ఎస్‌ఈసీ ఆంక్షలు విధించింది. వాటి ముద్రణదారుల వివరాలు, చిరునామా వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలని స్పష్టం చేసింది. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యులు రూ.30 వేల వరకు, సర్పంచ్‌ అభ్యర్థి గరిష్ఠంగా 1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలో వార్డు సభ్యులు రూ.50వేలు, సర్పంచ్‌ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.2.5లక్షల దాకా ఖర్చు చేయాలి.

స్ర్కీనింగ్‌ కమిటీ ఏర్పాటు

ఎన్నికలకోడ్‌ అమలు పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం స్ర్కీనింగ్‌ కమిటీని ఏర్పాటుచేసింది. సీఎస్‌ రామకృష్ణారావు కమిటీ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. నియమావళికి సంబంధించిన అంశాలు, ప్రతిపాదనలను ఎస్‌ఈసీకి పంపే ముందు ఈ కమిటీ పరిశీలిస్తుంది.

Updated Date - Nov 28 , 2025 | 04:26 AM