New Greenfield Expressway: ఫ్యూచర్‌సిటీ టు అమరావతి211
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:24 AM
హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గందిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్ దాదాపు ఖరారైంది..
ఫ్యూచర్ సిటీకి దగ్గర్లోని తిప్పారెడ్డిపల్లి వద్ద కుడివైపు నుంచి రోడ్డు ప్రారంభం
అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు రోడ్డు
మొత్తం పొడవు 297 కిలోమీటర్లు.. 2 కొత్త వంతెనలు
ప్రస్తుత బెజవాడ మార్గంతో పోల్చితే 57 కి.మీ తక్కువ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డ్రైపోర్టు
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నుంచి డ్రై పోర్టుకు కొత్త రోడ్డు
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గందిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్ దాదాపు ఖరారైంది. ఎక్కడి నుంచి ఎక్కడివరకు, ఎటువైపు నుంచి నిర్మించనున్నదీ స్పష్టత వచ్చింది. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)- రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీ (ముచ్చర్ల)కు సమీపంలోని తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో ఈ రహదారి ప్రారంభం కానుంది. ప్రస్తుత విజయవాడ రహదారికి కుడివైపుగా ఇది కొనసాగుతుంది. ఏపీలోని అమరావతి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం అవుతుంది. ఈ మేరకు ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్ వివరాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. దాని ప్రకారం ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరమే ఉండనుంది. ప్రస్తుత హైదరాబాద్-విజయవాడ మార్గంతో పోలిస్తే ఇది 57 కి.మీ తక్కువ. ప్రస్తుత మార్గంలో ప్రయాణానికి నాలుగున్నర గంటలు పడుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్ వేలో రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి-గుంటూరు మీదుగా బందరు వరకు ఉంటుంది. తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా హుజూర్‌నగర్‌కు కుడివైపు నుంచి కొనసాగుతుంది. ఏపీలోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీకి కూడా అనుసంధానం అవుతుంది. తర్వాత లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు చేరుతుంది. ఈ మార్గంలో రెండు వంతెనలు నిర్మించనున్నారు. రోడ్డు మొత్తం పొడవు సుమారు 297.82 కిలోమీటర్లు. అందులో ఫ్యూచర్‌సిటీ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు సుమారు 118 కిలోమీటర్లు, అక్కడి నుంచి బందరు పోర్టు వరకు 180 కి.మీ ఉంటుంది. దీని ప్రకారం ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు 211 కి.మీ దూరం ఉంటుంది. ఇక ఈ రోడ్డు పక్కనుంచే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని ఏపీ, తెలంగాణ కోరుతున్నాయి.
డ్రైపోర్టు పాలమూరు జిల్లాలోనే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డ్రైపోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు నుంచి ప్రతిపాదిత డ్రైపోర్టుకు కొత్త రోడ్డు నిర్మించాలనే ఆలోచన చేస్తోంది. దీనితో డ్రైపోర్టు నుంచి నేరుగా బందరు పోర్టుకు అనుసంధానం అవుతుందని, ఎగుమతులకు వీలవుతుందని భావిస్తోంది.
12 లేన్లు.. రూ.10 వేల కోట్ల వ్యయం
ప్రాథమిక అలైన్‌మెంట్ ప్రకారం ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, భూపరిహారం కలిపి రూ.10 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుందని అంచనా. అయితే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు రోడ్డును 12 వరుసలతో నిర్మించేందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రం సమ్మతిస్తే నిర్మాణ వ్యయంలో మార్పు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత అలైన్‌మెంట్‌ను 12 వరుసలకు తగ్గట్టుగానే రూపొందించినట్టు తెలిసింది. ఇందులో మొదట 6 లేదా 8 వరుసలతో నిర్మించి.. దశలవారీగా 12లేన్లకు విస్తరించవచ్చని సమాచారం. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ-మీరట్ హైవే 12 వరుసలతో, ఢిల్లీ-గుర్గావ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే 16 లేన్ల (8 ఎలివేటెడ్‌గా, 8 సర్వీస్ రోడ్ల)తో ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి బెంగళూరు వరకు 12 వరుసలతో ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-అమరావతి రోడ్డును 12 వరుసలతో నిర్మించేందుకు కేంద్రం సమ్మతిస్తే.. దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటి రోడ్డు అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.