Share News

IT minister Sridhar Babu: నిమిషంలోపే కుల ధ్రువీకరణ పత్రం

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:02 AM

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని వేగవంతం, సులభతరం చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు....

IT minister Sridhar Babu: నిమిషంలోపే కుల ధ్రువీకరణ పత్రం

  • నూతన విధానంలో 15 రోజుల్లో 17,500 మందికి సర్టిఫికెట్లు.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని వేగవంతం, సులభతరం చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించిన నిమిషంలోపే పత్రాలు జారీ అవుతున్నాయని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన నూతన విధానంపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి రాష్ట్రంలో 15 రోజుల క్రితం కొత్త విధానం అమలులోకి తెచ్చామని తెలిపారు. ఈ 15 రోజుల్లో 17,500 మందికి పైగా కులధ్రువీకరణ పత్రాలు పొందారని పేర్కొన్నారు. మారిన విధానం వల్ల ఏటా సుమారు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రం తీసుకునేటప్పుడు ప్రతిసారి ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో మొదటిసారి ఆమోదం తెలిపిన అధికారి పేరు, కొత్త జారీ తేదీ ఉంటాయన్నారు. పాత సర్టిఫికెట్‌ నెంబర్‌ తెలిసినవారు దాని ఆధారంగా వెంటనే కొత్త సర్టిఫికెట్‌ పొందచ్చని తెలిపారు. ఆ నెంబరు తెలియకపోతే జిల్లా, మండలం, గ్రామం, ఉపజాతి, పేరుతో శోధన చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని చెప్పారు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి సవరణలకు మాత్రం జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి, దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపారు. కాగా, 2020 సెప్టెంబర్‌ 9న జారీ చేసిన జి.ఓ.ఎమ్‌.సంఖ్య 3 ప్రకారం హిందూ ఎస్సీ వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ వర్గంలోకి వచ్చే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పూర్వపు ఆమోద విధానమే అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.


ఖైదీలకు డిజిటల్‌ విద్య

రాష్ట్రంలోని కారాగారాల్లో ఉంటున్న ఖైదీలకు డిజిటల్‌ విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఖైదీల ఆరోగ్యం, మానసిక స్థితి పర్యవేక్షణకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న 7వ ఆలిఇండియా ప్రిజన్స్‌ డ్యూటీ మీట్‌-2025లో రెండో రోజు, బుధవారం నిర్వహించిన ‘కల్చరల్‌ నైట్‌’కు మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ జైళ్లను శిక్షా కేంద్రాలుగా కాక సంస్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

మానసిక సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం

తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సైబర్‌ హోప్‌ హెల్ప్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ సిస్టం ‘హోప్‌ ఐ’ని టీహబ్‌లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. మానసిక సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యం సాంకేతిక పరిజ్ఞానానికి ఉందని ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణలు చేయాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీ హబ్‌ సీఈవో కవికృత్‌, సైబర్‌ హోప్‌ హెల్ప్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 05:02 AM