Traffic Solution: నగరం మధ్యలో.. నయా ఎక్స్‌ప్రెస్ వే!
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:21 AM
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతోపాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు...
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి..గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు రోడ్డు
హైదరాబాద్- సైబరాబాద్ అనుసంధానం
ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్
ఓఆర్‌ఆర్‌కు వేగంగా చేరేందుకూ మార్గం
ఆరేడు కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి,అండర్ పాస్‌లతో నిర్మించేలా ప్రణాళిక
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతోపాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్)కు వేగంగా చేరేందుకు వీలుగా కొత్త ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్-సైబరాబాద్‌ను అనుసంధానించేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు పది కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సాఽధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలన చేపట్టారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో దీనిని నిర్మించాలని భావిస్తున్నారు.
పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీతో
హైదరాబాద్ మహా నగరంలో జనాభా, వాహనాల రద్దీ వేగంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ఫ్ల్లైఓవర్లు, అండర్‌పా్‌సలను నిర్మించినా ఇంకా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి నగరం మధ్యలోకి వచ్చే మార్గాలు, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్లు, పాత ముంబై రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో ఇబ్బంది పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త ఎక్స్‌ప్రెస్ వే ప్రాతిపాదనను ముందుకు తెచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ-హబ్, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలోని ఫ్లైఓవర్ వరకు ఈ మార్గాన్ని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓఆర్‌ఆర్ నుంచి నేరుగా, వేగంగా నగరం మధ్యలోకి రాకపోకలకు ఈ మార్గం వీలుకల్పిస్తుంది. సుమారు ఆరేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల స్టీల్ బ్రిడ్జిని, అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్‌లను నిర్మించి.. వాహనాలు వేగంగా వెళ్లేలా దీనిని నిర్మించనున్నారు.
సర్వే ప్రారంభించిన కన్సల్టెన్సీ బృందం..
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై సర్వే బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఆ బృందం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, ఫిలింనగర్, జడ్జిస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. ఇప్పటికే రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, అవసరమైన చోట రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎక్కడెక్కడ అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలి.. అనే అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. హెచ్‌ఎండీఏ త్వరలోనే ఈ కొత్త రహదారి కోసం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి ప్రభుత్వానికి అందించే అవకాశముంది.