Minister Uttam Kumar Reddy: ప్రాణహిత చేవెళ్లకు కొత్త డీపీఆర్
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:19 AM
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారీలో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు...
నెలాఖరుకల్లా సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్
సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో సోలార్ ప్లాంట్లు
హైదరాబాద్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీలో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా డీపీఆర్‌కు తుదిరూపు ఇవ్వాలని నిర్దేశించారు. తుమ్మిడిహట్టి వద్ద 150మీటర్లతో బ్యారేజీ నిర్మాణం కోసం కసరత్తు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. శనివారం సచివాలయంలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో నిర్మించిన ప్రధాన కాలువ, ఇతర నిర్మాణాలు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని, స్వల్ప మరమ్మతులు చేసి ఉపయోగించుకోవచ్చని అధికారులు మంత్రికి నివేదించారు. 71.5 కి.మీ. విస్తరించి ఉన్న ప్రధాన కాలువ నెట్‌వర్క్ ఉపయోగించదగిన స్థితిలో ఉందని, రెండు ప్రధాన అక్విడక్ట్‌లు 70 శాతం పూర్తయ్యాయని నివేదించారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని మంత్రికి తెలియజేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పాత ప్రతిపాదనల ప్రకారం తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించి చేవెళ్లకు తీసుకురావాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా మైలారం గ్రామం వద్ద ఉన్న 71.5 కి.మీ. పాయింట్ వరకు నీళ్లు గ్రావిటీతో రానుండగా, అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలించడానికి రెండు ప్రత్యామ్నాయాలను అధికారులు సూచించారు. పాత ప్రతిపాదనల ప్రకారం మైలారం వద్ద ఒక లిఫ్ట్ నిర్మించి 50 కి.మీ. దూరంలోని ఎల్లంపల్లి జలాశయానికి తరలించవచ్చని వివరించారు. లేకుంటే మైలారం నుంచి 35 కి.మీ. దూరంలోని సుందిళ్ల బ్యారేజీకి గ్రావిటీతో నీటిని తీసుకెళ్లవచ్చన్నారు. రెండో ప్రత్యామ్నాయం కింద సొరంగంతో పాటు కాల్వ నిర్మించాల్సి ఉంటుందని, దాంతో నిర్మాణ,నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయన్నారు. రెండు ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తే నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన సాగునీటి ప్రాజెక్టుల భూములను గుర్తించాలని ఆదేశించారు.