Share News

New DGP Takes Charge: సోషల్‌ మీడియాపై నిఘా!

ABN , Publish Date - Oct 02 , 2025 | 05:08 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా చూడటం తమ ముందున్న మొదటి సవాలు అని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం శివధర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు....

New DGP Takes Charge: సోషల్‌ మీడియాపై నిఘా!

  • మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు.. రౌడీషీట్లు తెరిచేందుకూ వెనుకాడబోము

  • స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే మా ముందున్న మొదటి సవాల్‌

  • రెడ్‌ బుక్‌, పింక్‌ బుక్‌ లాంటివి ఉండవు

  • మాకు ఉన్నది ఒక్కటే బుక్‌.. ఖాకీ బుక్‌

  • మావోయిస్టులు లొంగిపోవాలి: శివధర్‌

  • రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా చూడటం తమ ముందున్న మొదటి సవాలు అని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం శివధర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వివిధ స్థాయిల్లో పలు సమావేశాలు నిర్వహించామని, బలమైన జట్టు తనకు ఉందని చెప్పారు. సమర్థవంతంగా పోలీసు విధులు నిర్వహించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ పోలీసు శాఖలో దాదాపు 17 వేలకు పైగా వివిధ స్థాయి పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, త్వరలో పోలీసు నియామకాలకు సంబంధించిన శుభవార్త వింటారని అన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై రౌడీషీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు. తమకు పింక్‌బుక్‌, రెడ్‌బుక్‌ అంటూ ఉండవని, ఉండేదీ ఒక్కటే ఖాకీ బుక్‌ అని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం చర్యలుంటాయన్నారు. సైబర్‌ క్రైం విభాగంలో సిబ్బంది కొరత ఉందన్నది వాస్తవం కాదని, దాదాపు అన్ని మండలాల్లో సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసులకు ఆధునిక శిక్షణ ఇవ్వడం ద్వారా వారి శక్తి సామర్థ్యాలను పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మరోవైపు సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.


మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం..

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఈగల్‌ బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త వాహనాలు సమకూరుస్తామని, వారి నైపుణ్యాలు పెంచే చర్యలు చేపడతామని తెలిపారు. మత్తుమందు తీసుకున్న వారిని స్పాట్‌లోనే గుర్తించే విధంగా మొబైల్‌ కిట్స్‌ ఎక్కువగా వినియోగిస్తామని చెప్పారు. బేసిక్‌ పోలీసింగ్‌లో భాగమైన విజబుల్‌ పోలీసింగ్‌ ద్వారా చాలావరకు నేరాలను అరికట్టవచ్చునన్నారు. ఫుట్‌ పెట్రోలింగ్‌, బీట్‌ పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలతో పెట్రోలింగ్‌ను పెంచడం ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు కనిపించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణలో సాంకేతికతకు పెద్దపీట వేస్తామని డీజీపీ తెలిపారు. నిఘా సమాచారం పోలీసులకు అత్యవసరమైనదని పేర్కొన్నారు. లొంగిపోయేందుకు ముందుకొచ్చే మావోయిస్టుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తామన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ ఇటీవల స్వయంగా రాసిన లేఖలోని అనేక విషయాలు ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ సెక్రటరీ బసవరాజ్‌ బతికి ఉన్నపుడే శాంతి చర్చలు, ఆయుధాలు వీడటంపై చర్చ జరిగిందన్న విషయాన్ని సోనూ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని తాము కోరుకుంటునట్లు చెప్పారు. ప్రభుత్వం కోరుకుంటున్న ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉండటం అవసరమన్నారు. అందుకు తగ్గట్లుగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగణంగా పనిచేస్తామని అన్నారు. తనను డీజీపీగా నియమించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు.. శివధర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


ఏసీబీ డీజీగా చారుసిన్హా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయకుమార్‌

  • బాధ్యతల స్వీకరణ

అవినీతి నిరోధక శాఖ డైరక్టర్‌ జనరల్‌గా 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి చారుసిన్హా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవలే ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళాపోలీసు అధికారికి ప్రభు త్వం ఈ బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి చారుసిన్హా గతంలో ఏసీబీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే చారుసిన్హాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమితులైన అదనపు డీజీ విజయకుమార్‌ బుధవారం లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

గవర్నర్‌ను కలిసిన నూతన పోలీస్‌ బాసులు..

నూతన డీజీపీ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ నూతన కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయకుమార్‌ బుధవారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసుశాఖలో ఇటీవల జరిగిన మార్పులు, స్ధానిక సంస్ధల ఎన్నికలు, శాంతిభద్రతలపై ఈ సందర్భంగా గవర్నర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. అనంతరం డీజీపీ శివధర్‌ రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Oct 02 , 2025 | 05:08 AM