సెర్ప్ ద్వారా ఇక కొత్త సంఘాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:43 AM
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఇక కొత్త సంఘాలు రానున్నాయి. ఇంతకాలం కేవలం మహిళలతోనే స్వయం సహాయక సంఘాలు ఏర్పడగా తాజాగా వృద్ధులు, కిశోర బాలిక లు, దివ్యాంగులు (స్ర్తీలు, పురుషులు) సెర్ప్ ద్వారా కొత్త సంఘాలుగా ఏ ర్పాటు కానున్నారు.
సెర్ప్ ద్వారా ఇక కొత్త సంఘాలు
వృద్ధులు, కిషోర బాలికలు, దివ్యాంగులు
వేర్వేరు కేటగిరీలతో సంఘాల ఏర్పాటు
అర్హత ఉన్న వారిని గుర్తించే పనిలో సెర్ప్ సిబ్బంది
ఈ నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు
నార్కట్‌పల్లి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఇక కొత్త సంఘాలు రానున్నాయి. ఇంతకాలం కేవలం మహిళలతోనే స్వయం సహాయక సంఘాలు ఏర్పడగా తాజాగా వృద్ధులు, కిశోర బాలిక లు, దివ్యాంగులు (స్ర్తీలు, పురుషులు) సెర్ప్ ద్వారా కొత్త సంఘాలుగా ఏ ర్పాటు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని సంఘాల్లో చేర్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నే కొత్త సంఘాల ఏర్పాటుకు సెర్ప్ వినూత్నంగా శ్రీకారం చుట్టింది. ఈ సంఘాల ఏర్పాటును కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక కోణంలో ఆలోచించిన ప్రభుత్వం వృద్ధులను, కిశోర బాలికలను, దివ్యాంగులను కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి సామాజిక ఆసరాగా నిలవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు కొత్తగా ఏర్పడే సంఘాల ఏర్పాటుకు సదరు కేటగిరీకు చెందిన వారిని గుర్తించే పనిలో మండల స్థాయిలో సెర్ప్ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఈనెలాఖరులోగా వారిని గుర్తించి సం ఘంగా ఏర్పడటంతో పాటు ఖాతాలను తెరిచేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ ప్రభుత్వ ఉద్దేశం
మహిళలు పొదుపు సంఘాలుగా ఏర్పడిన విషయం పాఠకులకు విదిత మే. సంఘాల్లో ఉన్న ఎంతో మంది మహిళలు పొదుపు డబ్బుల రుణం ద్వారా కుటీర ఉపాధి వనరులను, చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటూ కుటుంబ ఆర్థిక స్వావలంబనలో మహిళల పాత్రను మరింత ఇ నుమడింపజేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో వయస్సు మీరి ఇంటికే పరిమతమై తాము ఒంటరిగా ఉన్నామనే ధ్యాసతో వృద్ధులు మానసిక వ్య థకు గురికాకుండా సంఘంగా ఏర్పడటం ద్వారా వారిలో నవచైతన్యాన్ని త న కోసం నలుగురు ఉన్నారనే మానసిక స్థైర్యాన్ని పొందే అవకాశం ఉం టుందని ప్రభుత్వం భావించింది. వీరిని కూడా సంఘాలుగా ఏర్పడేలా వినూత్న ఆలోచన చేసింది. అదేవిధంగా కిషోర బాలికలను కూడా సంఘాలుగా చేర్చి వారిలో సమాజంపై మంచి చెడ్డలను తెలుసుకునే అవకాశాల ను కల్పించింది. ప్రభుత్వం కూడా వీరికి తరుచూ వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలని సంకల్పించింది. ఇకపోతే దివ్యాంగుల్లో కూడా తాము ఎవరికీ తీసిపోమనే విధంగా వారిని కూడా ప్రత్యేక సంఘాలుగా గుర్తించడం ద్వారా అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది.
పొదుపు మొత్తంపై షరతులు లేవు
సంఘాలుగా ఏర్పడే వారు ఇంత మొత్తంలో పొదుపు చేయాలనే షరతు ఏమీ లేదు. సంఘంలో చేరిన సభ్యుల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నెలానెలా ఎంత పొదుపు చేసుకోవాలనేది వారే నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ఉన్న మహిళా పొదుపు సంఘాల మాదిరిగానే ఈ సంఘాలు కూడా నెలానెలా సమావేశాలు నిర్వహించి పొదుపు డబ్బులు కట్టడం, బ్యాంకుల ద్వారా లో ను తీసుకోవడం, మ్యాచింగ్ గ్రాంటులు పొందడం, రికార్డుల నిర్వహణ వం టివి చేసుకోవచ్చు. వీఏవోలు, సంఘబంధాలు వీరికి సహకరించనున్నాయి.
సంఘాల ఏర్పాటు ఇలా
60సంవత్సరాలు ఆపై వయస్సు ఉన్న మహిళలందరూ వృద్ధుల సంఘాల్లో చేరవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైనా మహిళా సంఘాల్లో కొనసాగుతున్న వారెవరైనా ఉంటే వారు వృద్ధుల సంఘాల్లో చేరనవసరం లేదు. అదేవిఽధంగా కిషోర బాలికల్లో మాత్రం రెండు గ్రూపులుగా సంఘాలను ఏర్పాటు చేసేలా నిర్ణయించారు. 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న వారిని ఒక గ్రూపుగా 14 ఆపై సంవత్సరాల వయస్సు నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలను మరో గ్రూపుగా సంఘంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా కనీసం 10 మంది ఉండాల్సి ఉంది. కానీ దివ్యాంగుల సంఘాల ఏర్పాటుకు సభ్యుల సంఖ్యలో మినహాయింపు ఉంది. 5 నుంచి పది మందిలోపు ఉండే అవకాశాన్ని కల్పించారు. అయితే దివ్యాంగుల సంఘాల్లో స్ర్తీలతో పాటు పురుషులు కలిసి ఓ సంఘంగా ఏర్పడే వెసులుబాటు ఉంది. వయస్సు నిర్థారణకు వృద్ధులకు మాత్రం ఓటరు గుర్తింపు కార్డును ప్రామాణికం చేశారు.
ఇప్పటికే అవగాహన కల్పించాం
కొత్త సంఘాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బందికి అవగాహన కల్పించాం. ఇప్పటికీ సంఘాల్లో చేరని సభ్యులను గు ర్తించి వారిని కొత్త సంఘ సభ్యులుగా చేర్పించే పని లో ఏపీఎంలు, సీసీలు ఉన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, కిషోరబాలికలను గుర్తించి వారిని సం ఘాలుగా ఏర్పాటు చేసి ఖాతాలు తెరిపించి వెబ్‌సైట్‌లో నమోదు చే యించాలని ఆదేశాలిచ్చాం. జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీవో సిబ్బంది నిమగ్నమయ్యారు. అవసరమైతే వైద్యారోగ్య శాఖ, దివ్యాంగుల సంక్షేమశాఖ సహకారాన్ని తీసుకోవాలని సూచించాం.
శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, నల్లగొండ