Share News

Ponguleti Srinivas reddy: సంక్రాంతికి భూభారతి కొత్త పోర్టల్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:25 AM

సంక్రాంతి నాటికి ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేసి.. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ శాఖల వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి నూతన పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నాం....

Ponguleti Srinivas reddy: సంక్రాంతికి భూభారతి కొత్త పోర్టల్‌

  • రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి

  • 2.29 కోట్ల సర్వే నంబర్లకు భూదార్‌

  • పరిశ్రమల పేరుతో గత ప్రభుత్వంలో చేతులు మారిన భూముల లెక్కలు తేలుస్తాం

  • సాదాబైనామా కింద సర్కారు భూములను క్రమబద్ధీకరించం.. ‘అఫిడవిట్‌’పై స్పష్టతనిస్తాం

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదారాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): ‘సంక్రాంతి నాటికి ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేసి.. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ శాఖల వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి నూతన పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతమున్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు దశల వారీగా భూధార్‌ కార్డులు జారీ చేస్తాం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఇటీవల ప్రయోగాత్మకంగా రీ సర్వే చేపట్టిన ఐదు గ్రామాల రైతులకు భూధార్‌ కార్డులు ఇస్తాం.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలపై స్పష్టత వచ్చాక ట్రైబ్యునల్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తాం.. జీవో 58, 59 సమస్యలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో ఉన్న పట్టాలపైనా నిర్ణయం తీసుకుంటాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు సంక్రాంతి నాటికి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ సేవలను ఒకే పేజీలో ఉండేలా కొత్త భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ పోర్టల్‌ రైతులకు మెరుగైన సేవలను అందించేలా ఉంటుందని చెప్పారు. 373 గ్రామాల్లో రెండో విడత కింద సర్వే నిర్వహిస్తామన్నారు. మూడో విడతగా అన్ని జిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే అనంతరం భూదార్‌ కార్డులు అందిస్తామని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తామన్నారు. సమస్యలపై స్పష్టత వచ్చాక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసేందుకు గాను ఇంతవరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరుగుతోందని, వాటి ఫలితాలను గమనించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి అక్రమార్కుల భరతం పడతామని వ్యాఖ్యానించారు. సాదాబైనామా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములుంటే.. క్రమబద్ధీకరణ చేయలేమన్నారు. సాదాబైనామా దరఖాస్తుల విషయంలో అఫిడవిట్‌ ఇవ్వాలనే దానిపైనా అవసరమైతే ఇప్పుడున్న ఉత్తర్వులు సవరణ చేస్తామన్నారు. జీవో 58, 59 సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో పట్టాలిస్తే నిజమైన వారి కంటే బోగస్‌ ధ్రువపత్రాలు కలిగిన వారే ఎక్కువ ఉన్నారన్నారు. దీనిపై విచారించి.. నిజమైన ధ్రువపత్రాలున్న వారికి న్యాయం చేస్తామన్నారు. మునిసిపాలిటీల్లో విలీన ప్రక్రియ ముగిసిన తరువాత.. ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


నోటికొచ్చింది మాట్లాడితే ఎలా?

హిల్ట్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. ముడుపులు చెల్లించిన వారికే భూ బదలాయింపు చేపట్టారన్నారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్‌ ప్రాంతాలుగా మార్చారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత పాలకుల్లా సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం లేదన్నారు. పారదర్శకంగా క్యాబినెట్‌ తీర్మానం చేశాక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కన్వర్షన్‌ చేసిన భూముల వివరాల చిట్టాను గురువారం బయటపెడతామన్నారు.

తప్పుడు వార్తలతో నిజం మారదు..

ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలో రాఘవా కనస్ట్రక్షన్‌కు ఏం పని ఉంటుందని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా నిరాధారమైన వివరాలతో తప్పుడు వార్త రాసినంత మాత్రాన నిజం మారదన్నారు. ఓ దినపత్రికలో ‘బాంబుల మంత్రి కుమారుడి దౌర్జన్యకాండ’ అనే శీర్షికతో వచ్చిన వార్తపై తీవ్రంగా స్పందించారు. ఆధారాలు లేకుండా వార్త రాసిన వారే సిగ్గుపడతారన్నారు. తన కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అసలు తన కుమారుడు వివాదాస్పద స్థలం వద్దకే వెళ్లలేదని స్పష్టం చేశారు.

Updated Date - Dec 04 , 2025 | 04:26 AM