zonal commissioners taking charge: నయా జీహెచ్‌ఎంసీలో పాలన షురూ
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:39 AM
భారీగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీలో నూతన పాలన మొదలైంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ...
బాధ్యతలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు.. ఆరు ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటు
గోల్కొండ, రాజేంద్రనగర్‌లో ఆఫీసులు ప్రారంభించిన కర్ణన్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారీగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో నూతన పాలన మొదలైంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు ఏర్పాటైన మెగా కార్పొరేషన్‌కు సంబంధించిన డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్ (గెజిట్) గురువారం వెలువడగా.. వెంటనే జోనల్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వ జీహెచ్‌ఎంసీలో ఆరు జోన్లు ఉండగా.. కొత్తగా మరో ఆరు జోన్లు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటైన రాజేంద్రనగర్, గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రారంభించారు. రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, గోల్కొండ జోనల్ కమిషనర్‌గా జీ ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ప్రియాంక ఆల బాధ్యతలు చేపట్టారు. పాత జీహెచ్‌ఎంసీలోని ఇతర జోనల్ కమిషనర్ల బదిలీ జరగకున్నా.. పునర్విభజన నేపథ్యంలో సర్కిళ్లు, డివిజన్లు మారడంతో నూతన పాలనలో భాగంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, శంషాబాద్ జోనల్ కార్యాలయాల్లోనూ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయాలను పూర్వ సర్కిల్ కార్యాలయాల్లో.. శంషాబాద్, గోల్కొండ జోనల్ ఆఫీ్‌సలను పాత మునిసిపల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేశారు.
పాలన జీహెచ్‌ఎంసీ పరిధిలోకి: కర్ణన్
27 శివారు మునిసిపాలిటీలను కలుపుతూ విస్తరిత జీహెచ్‌ఎంసీ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తి కావటంతో విలీన ప్రాంతాల్లో పాలన బల్దియా పరిధిలోకి వచ్చిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. పాత జీహెచ్‌ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. కొత్త మహా నగరపాలక సంస్థ 2,071 చ.కి.మీల పరిధిలో ఏర్పాటయ్యిందని చెప్పారు. ఇది దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అని వెల్లడించారు. 300 డివిజన్లు, 60 సర్కిళ్లు, 12 జోనల్ కార్యాలయాలతో పౌర సేవల వికేంద్రీకరణ జరిగిందని చెప్పారు. కాగా, విలీన మునిసిపాలిటీలకు సంబంధించిన సమగ్ర సమాచార సేకరణను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. డాటా బదిలీకి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉండగా, త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఐటీ విభాగం వర్గాలు చెబుతున్నాయి. విలీన ప్రాంతాల్లో భూ లభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచణ ప్రణాళిక రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.