Kalojis Literary Legacy: ఊరూరా కాళోజీ సాహిత్యాన్ని పంచుతాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:15 AM
ప్రజా వైతాళికుడు కాళోజీ ఔన్నత్యం నేటితరం తెలుసుకోవాలని, ఆ మహనీయుడి సాహిత్యం ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేస్తామని మంత్రి జూపల్లి ..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంత్యుత్సవాలు
రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి అవార్డు ప్రదానం
హైదరాబాద్ /హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా వైతాళికుడు కాళోజీ ఔన్నత్యం నేటితరం తెలుసుకోవాలని, ఆ మహనీయుడి సాహిత్యం ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సామాజిక మార్పు లక్ష్యంగా సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను ప్రోత్సహించే బాధ్యతను సాంస్కృతిక శాఖ స్వీకరించేందుకు సిద్థంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజీ 111వ జయంత్యుత్సవాలు మంగళవారం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవికి మంత్రి కృష్ణారావు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజ గొడవను తన గొడవగా మలచుకొని ‘నా గొడవ’ అంటూ అద్భుతమైన కవిత్వాన్ని మనకు అందించారని కొనియాడారు. ‘అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు’ అంటూ శక్తిమంతమైన కవిత్వాన్ని భావితరాలకు కాళోజీ అందించారని తెలిపారు. అలాంటి మహానుభావుడి జయంతి సభలో యువత కనిపించకపోవడం బాధాకరమన్నారు. కాళోజీ పురస్కారాన్ని మొదటి సారిగా మహిళకు ప్రదానం చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రియాజ్, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాళోజీతో తనకున్న అనుబంధాన్ని అవార్డు స్వీకర్త నెల్లుట్ల రమాదేవి గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిర్భీతి, అన్యాయం చేసిన వాడు ఎంతటి వ్యక్తి అయినా నిలదీేస శక్తి కాళోజీ సొంతమని, తెలంగాణ భాషాభివృద్థికి మరింత కృషి జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
బీసీ కమిషన్ కార్యాలయంలో ’కాళోజీ’ కి ఘనంగా నివాళులు
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ నారాయణ రావు గొప్ప కవి, ప్రజల పక్షపాతి అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ అన్నారు. బీసీ కమిషన్ కార్యాలయంలో జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కాళోజీ ప్రజా కవి మాత్రమే కాదని, శాసన మండలి సభ్యులుగా ేసవలందించారని గుర్తు చేశారు. ఆయన రాసిన ’నా గొడవ’ ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు.