Telangana Students: మా స్థానికత ఎక్కడ? మా భవిష్యత్ ఏమిటీ?
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:04 AM
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు శాపంగా మారిన జీవో నం.33ను వెంటనే రద్దు చేయాలని నీట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...
జీవో 33ను రద్దు చేయాలి.. ప్రభుత్వం న్యాయం చేయాలి
ఇందిరాపార్కు వద్ద నీట్ ర్యాంకర్లు, తల్లిదండ్రుల ధర్నా
కవాడిగూడ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు శాపంగా మారిన జీవో నం.33ను వెంటనే రద్దు చేయాలని నీట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల నష్టపోతున్న నీట్ యూజీ-2025 తెలంగాణ క్వాలిఫైడ్ విద్యార్థులకు న్యాయం చేయడానికి తక్షణమే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. జీవోకు ముందు అర్హత ఉన్నా సరే లోకల్ కాదని తిరస్కరించడం దారుణమని, తమకు శాపంగా మారిన లోకల్, నాన్ లోకల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ‘ప్రభుత్వమా.. మా స్థానికత ఎక్కడ? మా భవిష్యత్ ఏమిటీ? మాకు న్యాయం చేయండి’ అంటూ నీట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తక్షణమే ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని నీట్ పరీక్ష రాసిన మొత్తం 45 మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేయకుండా తక్షణమే సమస్యను పరిష్కరించి వారి భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.