NDMA Directs Submission of Dam Safety: డ్యామ్‌ల భద్రతపై నివేదికలివ్వండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:10 AM
నిర్ణీత గడువు లోగా కేంద్ర ఆనకట్టల భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రంలోని జల వనరుల ప్రాజెక్టులపై స్థితిగతులపై సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర వెబ్‌సైట్‌లో...
నీటి పారుదల అధికారులకు ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్ ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత గడువు లోగా కేంద్ర ఆనకట్టల భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రంలోని జల వనరుల ప్రాజెక్టులపై స్థితిగతులపై సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నీటి పారుదలశాఖ అధికారులకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లతో జలసౌధలో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఎన్‌డీఎ్‌సఏ ప్రకారం తెలంగాణలోని 174 డ్యామ్‌ల స్థితిగతులను మూల్యాంకనంతోపాటు అత్యవసర ప్రణాళిక, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) మాన్యువల్‌లను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా ప్రాజెక్టుల ఓనర్ల (చీఫ్ ఇంజనీర్లు)దేనని, కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, దానివల్ల జరిగే నష్టానికి ఆ అధికారులదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులపై సమగ్ర రక్షణ మూల్యాంకనం (సీడీఎ్‌సఈ)పై సీఎం రేవంత్ రెడ్డికి గత అక్టోబరు 17న లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఆయా ప్రాజెక్టుల నివేదికలు సమగ్రంగా లేవని విచారం వ్యక్తం చేశారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను కేంద్రానికి సమర్పించడానికి గడువు ఉందన్నారు. కేంద్ర మంత్రి పాటిల్ లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆ ప్రాజెక్టులపై తయారు చేసిన నివేదికల స్థితిగతులను తెలుసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్.. స్పెసిఫైడ్ డ్యామ్ లిస్టులోని కేటగిరి-2లో గల 10 ప్రాజెక్టులను కేటగిరి-3లోకి మార్చాలని స్పష్టం చేశారు. నిరాశాజనకంగా ఉన్న జూరాల, రేలంపాడు, ముచ్చునోనిపల్లి వంటి ప్రాజెక్టులను కేటగిరి-3లోకి మార్చాలన్నారు. స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలోని చేగావ్ ప్రాజెక్టు, పెద్ద చెరువు (స్తంభాలపల్లి) స్థానే చనకా కొరాటా, సదర్‌మఠ్ బ్యారేజీలను చేరాలని అనిల్ జైన్‌కు అధికారులు గుర్తు చేశారు. అధికారులు స్పందిస్తూ ఇప్పటికే 2 డ్యామ్ సేఫ్టీ రివ్యూ పానెళ్లు ఉన్నాయని, మరో ప్యానల్ కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇక నివేదికల కోసం కోర్ టెక్నికల్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశామని గడువు లోగా నివేదికలు సిద్ధం చేస్తామని చెబితే 3 నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్ అనిల్ జైన్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 174 ప్రాజెక్టులు స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో ఉన్నాయి. సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కం డ్యామ్ ఓనర్ ఆధ్వర్యంలో నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది