పుర పోరుపై నజర్
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:38 AM
స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పల్లెపోరు ముగియడంతో ఇక పట్టణ పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. అయితే తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని భావించినా, పుర పోరుకే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతాలు
ఓటర్ల జాబితాలు సిద్ధం చేసేందుకు అధికారుల సన్నాహాలు
పునర్విభజన లేనిపక్షంలో జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్!
పదేళ్ల రిజర్వేషన్‌ను ఎత్తివేసే అవకాశం
పంచాయతీల మాదిరిగానే మునిసిపాలిటీల్లో రిజర్వేషన్లు?
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పల్లెపోరు ముగియడంతో ఇక పట్టణ పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. అయితే తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని భావించినా, పుర పోరుకే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మునిసిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరి 25తో ముగిసింది. పాలకవర్గాలు లేక 11 నెలలు దాటింది. గ్రామపంచాయతీ మాదిరిగానే మునిసిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధు లు రావాలంటే పాలకవర్గాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం జిల్లాయంత్రాంగానికి సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కలెక్టర్ల తో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మొ త్తం ఆరు మునిసిపాలిటీలు భువనగిరి, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కురు, చౌ టుప్పల్ ఉన్నాయి. పుర పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో ఆశావహులు ప్రచార రంగంలోకి దిగేందుకు కార్యాచరణ రూపొందించుకోవడం లో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి.పార్టీల గుర్తులపై ఎన్నికలు ఉండనుండటంతో అందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, పంచాయతీ ఎన్నికల మాదిరిగా ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి రిజర్వేషన్ల కేటాయింపులపై మునిసిపాలిటీల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారో అని నేతలంతా కలవరపడుతున్నారు.
ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం సమాయత్తమవుతుండటం, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో తాజాగా ఓటరు జాబితాల రూపకల్పన దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం వెలువరించింది. మంగళవారం నుంచి సంబంధిత ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించింది. మునిసిపాలిటీలకు సంబంధించిన సమగ్ర సమచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు ఉండటంతో లోక్‌సభ ఎన్నికల జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా పోలింగ్ కేంద్రాల సమాచారం, వసతుల వివరాలు మునిసిపాలిటీల వారీగా తీసుకున్నారు. పునర్విభజన చేసి వార్డుల వారీ ఓటర్ల జాబితాలు రూపొందించాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. అందులో మార్పులు, చేర్పులకు అవకాశాన్ని కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను జనవరి 1న ప్రకటిస్తారు. అదేరోజు ఏవైనా అభ్యంతరాలుంటే తీసుకుంటారు. జనవరి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఓటరు జాబితాను పరిశీలిస్తారు. తుది ఓటరు జాబితాను జనవరి 10న అధికారికంగా పోలింగ్ బూత్‌ల వారీగా ప్రకటిస్తారు. ఈ లోగా మార్పులు చేర్పులతో పాటు కొత్త ఓటరు నమోదుకు అవకాశాన్ని కల్పిస్తారు.
పునర్విభజన లేనిపక్షంలో...
ప్రభుత్వం మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయాలని యోచిస్తోంది. గత ప్రభుత్వం 2019లో మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. వార్డుల పునర్విభజన లేనిపక్షంలో జనవరి రెండు లేదా మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేసిన పక్షంలో ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మునిసిపాలిటీల్లో బోగస్ ఓట్లు ఉన్నాయనే దుమారం గతంలో ఉండగా, దీనిపై ప్రధాన పార్టీల నాయకులు దృష్టి కేంద్రీకరించారు. బోగస్ ఓటర్లు ఉన్న పక్షంలో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని పార్టీల అధిష్ఠానాలు సూచించాయి. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీ ఎన్నికలకు ఓ వైపు అధికార యంత్రాంగం, మరోవైపు పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు.