Naveen Yadav Takes Oath: స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా నవీన్‌యాదవ్ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:44 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నవీన్ యాదవ్ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు...
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నవీన్ యాదవ్ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో జరిగిన ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిన సంగతి తెలిసిందే. స్పీకర్ కార్యాలయంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గణేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హన్మంతరావుతో పాటు నవీన్ యాదవ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్‌యాదవ్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం నవీన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ సమగ్ర అభివృద్ధి కోసం పని చేస్తానని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. తనకు టిక్కెట్ కేటాయించి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.