Share News

Naveen Yadav: జూబ్లీహిల్స్‌ రేసులో నవీన్‌ యాదవ్‌!

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:39 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రేసులో నవీన్‌ యాదవ్‌ ముందంజలో ఉన్నారా? కాంగ్రెస్‌ టికెట్‌ ఆయనకే దక్కనుందా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి...

Naveen Yadav: జూబ్లీహిల్స్‌ రేసులో నవీన్‌ యాదవ్‌!

  • తాను పోటీలో లేనన్న బొంతు రామ్మోహన్‌

  • నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌ పేర్లతో అధిష్ఠానానికి టీపీసీసీ ప్రతిపాదన

  • నేడో రేపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రేసులో నవీన్‌ యాదవ్‌ ముందంజలో ఉన్నారా? కాంగ్రెస్‌ టికెట్‌ ఆయనకే దక్కనుందా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక కోసం టీపీసీసీ ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపింది. మంగళవారం జూమ్‌ ద్వారా భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు. ఆయా అభ్యర్థుల సానుకూల, ప్రతికూల అంశాలను వివరించారు. మరోవైపు బొంతు రామ్మోహన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను జూబ్లీహిల్స్‌ అభ్యర్థి రేసులో లేనని స్పష్టం చేశారు. తనకు టికెట్‌ కావాలని ఎవరినీ అడగలేదన్నారు. టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. టీపీసీసీ ప్రతిపాదించిన మూడు పేర్లను అధిష్ఠానం పరిశీలించి, అభ్యర్థిని ఎంపిక చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అభీష్టం మేరకే అభ్యర్థిని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నేతనే అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదనకే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. స్థానిక కోటాలో నవీన్‌యాదవ్‌, సీఎన్‌ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే బీసీకే టికెట్‌ దక్కే అవకాశం ఉందంటూ పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ స్పష్టత ఇచ్చిననేపథ్యంలో నవీన్‌ యాదవ్‌ పేరు ఖాయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీపీసీసీ ప్రతిపాదించిన మూడు పేర్లు కాకుండా అనూహ్యంగా ఇతర సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. బిహార్‌ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం భేటీ కానుంది. ఆ భేటీలో జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అంశం కూడా చర్చకు వస్తుందా? రాదా? అన్నదానిపై స్పష్టత లేదు. టీపీసీసీ ప్రతిపాదించిన పేర్లనే పరిగణనలోకి తీసుకుంటే బుధవారమే అభ్యర్థిని ప్రకటిస్తారని, సంప్రదింపులు జరపాలని భావిస్తే కొద్ది రోజులు పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Oct 08 , 2025 | 04:39 AM