Share News

Naveen Yadav Nomination: అట్టహాసంగా నవీన్‌ నామినేషన్‌

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:22 AM

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగిన వి.నవీన్‌ యాదవ్‌.. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు...

Naveen Yadav Nomination: అట్టహాసంగా నవీన్‌ నామినేషన్‌

  • పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, గద్వాల విజయలక్ష్మి, వీహెచ్‌, అజారుద్దీన్‌

  • సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: పొన్నం

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు మజ్లిస్‌ మద్దతు

  • మా మద్దతు కాంగ్రె్‌సకే: కూనంనేని

  • కాంగ్రె్‌సకు ఎంఐఎం మద్దతు సిగ్గుచేటు: బండి సంజయ్‌

బంజారాహిల్స్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగిన వి.నవీన్‌ యాదవ్‌.. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన.. రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌యాదవ్‌తో కలిసి ర్యాలీగా షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలోని ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలు, కళాకారుల నృత్యాల మధ్య కాంగ్రెస్‌ అనుకూల నినాదాలతో ర్యాలీ అట్టహాసంగా సాగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి నవీన్‌ యాదవ్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి దారులు వేస్తాయన్నారు. పది సంవత్సరాల పాటు మున్సిపల్‌ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వ్యవహరించారని ఆరోపించారు. నవీన్‌యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వనం సంగీతాయాదవ్‌, పి.విజయారెడ్డి, గ్రంరఽథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పాల్గొన్నారు.


బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో..

నామినేషన్‌ అనంతరం నవీన్‌యాదవ్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2లోని మసీదులో ప్రార్థనకు వచ్చిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ కలిసి మద్దతు కోరగా.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్‌.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకే తమ మద్దతు అని స్పష్టం చేశారు. అయితే, బిహార్‌ శాసనసభ ఎ్ననకల్లో మజ్లిస్‌ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తున్నందున తాను అక్కడ ప్రచారం చేయాల్సి ఉంటుందని, కాబట్టి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో తాను పాల్గొనబోనని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకత్వం అంతా నవీన్‌ యాదవ్‌తో కలిసి పనిచేస్తారని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ పదేళ్లపాటు ప్రాతినిధ్యం వహించినప్పటికీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడమే తప్పన్నారు. సానుభూతి కన్నా అభివృద్ధే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. సీపీఐ కూడా ఈ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ శుక్రవారం మఖ్దూంభవన్‌కు వెళ్లి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులను కలిసి మాట్లాడగా వారు అందుకు సుముఖత తెలిపారు. కాగా.. నవీన్‌ యాదవ్‌ నామినేషన్‌ ర్యాలీ అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనలాగా కొనసాగిందని ఎమ్మెల్యేల దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్నవారంతా కత్తులు, కటార్లతో వీరంగా వేశారని.. ఆ ప్రదేశం అంతా రౌడీలతో నిండిపోతే పోలీసులు చోద్యం చూశారని ధ్వజమెత్తారు. ఇక.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు మజ్లిస్‌ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘‘అసదుద్దీన్‌ కాంగ్రె్‌సను శాసిస్తారు. అక్బరుద్దీన్‌ బీఆర్‌ఎ్‌సకు సలహాలిస్తారు. తామేదో పరస్పరం పోట్లాడుకుంటున్నట్టు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు నటిస్తాయి. కానీ బీజేపీని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలూ ఎంఐఎం వద్ద రాజకీయ ట్యూషన్‌ తీసుకుంటున్నాయి’’ అని సంజయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు తప్పుడు ప్రచారమేనని ఆయన స్పష్టం చేశారు.


రూ.29.66 కోట్ల ఆస్తి.. 75 లక్షల అప్పు!

  • 11 తులాల బంగారం.. స్కోడా కారు.. రూ.7 లక్షల షేర్లు

  • ఇవీ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆస్తుల వివరాలు

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌యాదవ్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.. ఆయన స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు.అ ప్పు రూ.75 లక్షలు. ఆయన చేతిలో రూ.4 లక్షల నగదు, 5 బ్యాంకు ఖాతాల్లో రూ.37.6 లక్షల సొమ్ము, ఒక స్కోడా కారు, రూ.7 లక్షల విలువ చేసే షేర్లు, 11 తులాల బంగారం, ఆయన పేరిట 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసు్‌ఫగూడలో 860 గజాల ఇంటిస్థలం ఉన్నాయి. ఆయనపై 7 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక.. ఆయన భార్య వర్షా యాదవ్‌ వద్ద 2లక్షల నగదు ఉన్నాయి, ఆమె పేరిట ఉన్న రెండు బ్యాంకు ఖాతాల్లో పది వేల రూపాయల సొమ్ము, రెండు కిలోల బంగారం, 15 కేజీల వెండి, 4.3 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇల్లు ఉన్నాయి. ఆమె ఆస్తుల విలువ 5.75 కోట్లు.

Updated Date - Oct 18 , 2025 | 05:23 AM