Naveen Yadav Declared Congress Candidate: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:05 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ ప్రకటన
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో నవీన్
నవ యువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ
యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు
2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ
హైదరాబాద్, బంజారాహిల్స్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. సామాజిక కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ విద్యార్థి దశ నుంచే చురుకుగా రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్ పట్టభద్రుడైన ఆయన.. నవ యువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి ఏంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2023 అసెంబ్లీఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా అప్పటీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. యాదవ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెరమీదకు వచ్చినప్పటి నుంచి అభ్యర్థిగా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సీటు తమకే కేటాయించాలంటూ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంజర్ల విజయలక్ష్మి, మురళీగౌడ్ తదితరులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు, పీసీసీ నాయకులు చర్చలు జరిపి నవీన్‌యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, సీఎన్‌రెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపించారు. చివరి వరకూ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ సాగినప్పటికీ అధిష్ఠానం నవీన్ యాదవ్ వైపే మొగ్గుచూపింది. నవీన్ యాదవ్‌కు పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన ఇంటి వద్ద బుధవారం రాత్రి అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. కాగా.. తనను అభ్యర్థిగా ప్రకటించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు.