R. Narayana Murthy: తెలంగాణ సర్కారుకు సెల్యూట్
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:42 AM
జీవితాంతం పీడిత ప్రజల విముక్తికి పోరాడిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. లాల్-నీల్ ఏకం కావాలని పరితపించిన వాగ్గేయకారుడని అభివర్ణించారు.
గద్దర్ సినీ అవార్డు జ్ఞాపికలో ప్రజా యుద్ధనౌక ప్రతిమ ఉండాలి
గద్దర్ ద్వితీయ వర్ధంతి సభలో ఆర్.నారాయణ మూర్తి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జీవితాంతం పీడిత ప్రజల విముక్తికి పోరాడిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. లాల్-నీల్ ఏకం కావాలని పరితపించిన వాగ్గేయకారుడని అభివర్ణించారు. తెలుగు సినిమా పరిశ్రమలో 14 ఏళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను తిరిగి నిర్వహించడంతోపాటు వాటికి గద్దర్ పేరు పెట్టిన తెలంగాణ సర్కారు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు సెల్యూట్ చేశారు. అసోం ప్రభుత్వాఫీసుల్లో అంబేడ్కర్, గాంధీజీ చిత్రపటాలతోపాటు ప్రఖ్యాత కవి- గాయకుడు భూపేన్ హజారికా ఫోటో కనిపించినట్లే తెలంగాణలో గద్దర్‌కు ఆ గౌరవం కల్పించడం శ్లాఘనీయమన్నారు. రవీంద్రభారతిలో బుధవారం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన గద్దర్ ద్వితీయ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
గద్దర్ సినీ అవార్డుల జ్ఞాపికలో ఆయన ప్రతిమను చిహ్నంగా ఉంచాలని సూచించారు. కవి, రచయిత జిలుకర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో గద్దర్ స్మృతి గీతాల సంపుటి ‘పాలధార’, ‘నా పల్లె’, ‘ప్రతి పాటకూ ఒక కథ ఉంది’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అందెశ్రీ, ఏపూరి సోమన్న, ప్రకృతి కవి జయరాజ్, గద్దర్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శాంతాసిన్హా, సామాజిక కార్యకర్తలు సజయ, పృఽథ్వీరాజ్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి, క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సూర్య కిరణ్ మాట్లాడుతూ ప్రజలే గద్దర్‌కు అసలైన వారసులని, గద్దర్ కళాక్షేత్రం నిర్మించడమే తన లక్ష్యమన్నారు. అధిక సంఖ్యలో హాజరైన జానపద కవులు, కళాకారులు ఆట, పాటలు, ఉద్యమ గీతాలతో గద్దర్‌కు నివాళులర్పించారు.