Nalgonda Crime: ఇంటర్ విద్యార్థినిపై హత్యాచారం
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:57 AM
కళాశాలకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఇంటర్ విద్యార్థిని కొద్ది గంటల్లోనేలైంగిక దాడికి, హత్యకు గురైంది. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో....
నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన.. నిందితుడిపై హత్య, అత్యాచారం, పోక్సో కేసు
నల్లగొండ క్రైం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కళాశాలకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఇంటర్ విద్యార్థిని కొద్ది గంటల్లోనేలైంగిక దాడికి, హత్యకు గురైంది. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిందీ దారుణం. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) నల్లగొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ ఆమె తమ ఊరి నుంచి ఆటోలో నల్లగొండకు వెళ్లి.. అదే ఆటోలో సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే గడ్డం కృష్ణ అనే వ్యక్తి రోజూ అదే ఆటోలో వెళ్తుండేవాడని.. అతడితో ఆమెకు స్నేహం కుదిరిందని సమాచారం. ఈ క్రమంలో మంగళవారం కళాశాలకు బయలుదేరిన ఆమెను.. కృష్ణ తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. రెండు గంటల తర్వాత.. ఆ గదిలో బాలిక మృతిచెందినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు కూడా సంఘటనా స్థలానికి పెద్దసంఖ్యలో తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని కట్టడి చేసి బాలిక మృతదేహాన్ని అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడే స్వయంగా టూటౌన్ పోలీసుల వద్దకు వెళ్లి బాలిక మృతిచెందిన విషయం చెప్పి లొంగిపోయినట్లు తెలిసింది. కాగా.. గడ్డం కృష్ణ తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి అతని స్నేహితుడి గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశాడని.. అతడికి అతడి స్నేహితుడు సహకరించాడని.. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడో వ్యక్తి ప్రమేయంపై దర్యాప్తు
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గడ్డం కృష్ణపై అత్యాచారం, హత్య కేసులతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెపై కృష్ణ ఒక్కడే హత్యాచారానికి పాల్పడ్డాడా లేక మూడో వ్యక్తి ప్రమేయం ఇందులో ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.