Share News

Nagoba Jatra: 18 అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:08 AM

ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబా జాతర కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మెస్రం వంశీయులు మంగళవారం మధ్యాహ్నానికి కేస్లాపూర్‌ నాగోబా మురాడి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు...

Nagoba Jatra: 18 అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర

ఇంద్రవెల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబా జాతర కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మెస్రం వంశీయులు మంగళవారం మధ్యాహ్నానికి కేస్లాపూర్‌ నాగోబా మురాడి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు అధ్యక్షతన సమావేశమై ‘గంగాజలం’ తేవడానికి వెళ్లే రూట్‌ను ఎంపిక చేశారు. ఆలయం వద్ద భద్రపరిచిన కలశం, పూజా సామగ్రిని బయటకు తీశారు. తెల్లని వస్త్రంపై కలశాన్ని పెట్టి సంప్రదాయం ప్రకారం స్త్రీ, పురుషులు వేర్వేరుగా పూజలు చేశారు. తెల్లని వస్త్రంతో కటోడ మెస్రం హన్మంతరావు వీపుకు కలశాన్ని కట్టిన తర్వాత ప్రధాన్‌ మెస్రం దాదారావ్‌తోపాటు 100 మంది మెస్రం వంశీయులు మర్యాద పూర్వకంగా ఒకరినొకరు కలుసుకున్న తర్వాత అక్కా చెల్లెళ్లకు కానుకలు సమర్పించి.. మహా పూజలకు అవసరమైన గంగాజలం కోసం మంగళవారం సాయంత్రం కాలినడకన బయలు దేరారు. మంగళవారం రాత్రి కేస్లాగూడలో బస చేసిన హన్మంతరావు బృందం.. జనవరి 6 వరకూ వివిధ గ్రామాల్లో బస చేసి.. 7న జన్నారం మండలం గోదావరి హస్తిన మడుగు వద్దకే చేరుకుంటారు. అక్కడ గంగా పూజలు చేసి గంగాజలం సేకరించిన తర్వాత తిరుగు పయనమవుతారు. 9న గౌరీ, 14న ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయంలో పూజలు చేసి.. అదే రోజు సాయంత్రం కేస్లాపూర్‌లోని వడమర (మర్రిచెట్టు) వద్దకు చేరుకున్న హన్మంతరావు బృందం.. అక్కడే 3 రోజులు బస చేస్తుంది. 18న ఆలయ సమీప గోవ్వాడ్‌కు.. అదే రోజు రాత్రి నాగోబా ఆలయానికి చేరుకుని మహా పూజలు చేయడంతో జాతర మొదలవుతుంది.

Updated Date - Dec 31 , 2025 | 05:08 AM