Deputy CM Bhatti Vikramarka highlighted NABARD role: గ్రామీణ భారతానికి నాడి.. నాబార్డు
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:45 AM
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు కృషి ఎనలేనిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు...
నిశ్శబ్ధ శక్తిగా ఆర్థిక వ్యవస్థకు దన్ను.. రాష్ట్రంలో టీ-ఫైబర్‌తో అనేక ప్రయోజనాలు
నాబార్డు ఎర్త్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి
ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ: తుమ్మల
హైదరాబాద్/రాయదుర్గం, నవంబరు 31 (ఆంధ్రజ్యోతి): భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) కృషి ఎనలేనిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. నిశ్శబ్ధ శక్తిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థకు నాబార్డు దన్నుగా నిలుస్తోందని తెలిపారు. నాబార్డు లేకపోతే గ్రామీణ భారతదేశం లేదని అన్నారు. నాబార్డు, భారత్ ఇంటర్నేషనల్ మొబైల్ అసోసియేషన్ సంయుక్తంగా మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఎర్త్ సమ్మిట్‌లో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాబార్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయ, నీటిపారుదల రంగాల అభివృద్ధికి కృషిచేస్తోందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధునీకరణ, వ్యవసాయ డిజిటలైజేషన్, ఎఫ్‌పీవోలకు సుస్థిర శక్తి ఇవ్వటంలో నాబార్డు పాత్ర కీలకమని ప్రశంసించారు. డిజిటల్ హైవేల ఏర్పాటులో భాగంగా టీ-ఫైబర్ ద్వారా 43 వేల కిలోమీటర్ల మేర ప్రతి గ్రామాన్ని కలుపుతున్న వ్యవస్థ టెలి మెడిసిన్, రిమోట్ విద్య, ఈ-కామర్స్, ఆధునిక వ్యవసాయానికి ఎంతో శక్తిని అందిస్తోందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధికి సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో స్టార్ట్‌పలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్‌లో నాబార్డు చైర్మన్ షాజీ, సీజీఎం ఉదయభాస్కర్, గోవర్దన్‌సింగ్ రావత్, డాక్టర్ అజయ్ కుమార్ సూద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎర్త్ సమ్మిట్‌లో ప్రదర్శించిన సరికొత్త ఆవిష్కరణలు ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. అంకుర పరిశ్రమలు, మహిళల ఆధారిత ఎంటర్ పెన్యూర్‌షిప్, గ్రామీణ బ్యాంకులు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
బయో ఫెర్టిలైజర్ మైక్రో మ్యాజిక్
పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులను రైతుస్థాయిలో తయారుచేసుకునేందుకు వీలుగా రూపొందించిన మైక్రో మ్యాజిక్ యూనిట్‌ను ఎర్త్ సమ్మిట్‌లో ప్రదర్శించారు. దీనితో నాణ్యమైన బయోఫెర్టిలైజర్, బయోపెస్టిసైడ్‌లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మార్కెట్లో బయో ఉత్పత్తులు లీటరుకు రూ.250 నుంచి రూ.400 వరకు ఖర్చు అవుతుంది. సొంతంగా మైక్రో మ్యాజిక్‌లో తయారుచేస్తే... ఒక లీటరు ఉత్పత్తికి రూ.25 నుంచి రూ.40 మాత్రమే రైతులకు ఖర్చు వస్తుందని తయారీదారులు తెలిపారు. దీని ఒక యూనిట్ విలువ రూ.3.50 లక్షలు. ఒక యూనిట్‌తో 2 వేల ఎకరాలకు సరిపడా 40 వేల లీటర్ల బయో ఎరువులు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఒక్కో బ్యాచ్‌కు 600 లీటర్ల చొప్పున మూడునాలుగు రోజుల్లో మొత్తం ఉత్పత్తి వస్తుంది.
ఒక్క చార్జితో 4 ఎకరాలు దున్నే ఎలక్ట్రిక్ ట్రాక్టర్
ఐఐటీ పాలక్కడ్, అలెప్, వీహబ్ సహకారంతో కెనారెక్స్ సంస్థ తయారుచేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఆకట్టుకుంది. ఈ ట్రాక్టర్ కు ఒకసారి ఛార్జింగ్ పెడితే 4- 6 గంటలపాటు పనిచేస్తుంది. 4 ఎకరాలు దున్నుతుంది. దీని పైకప్పు సోలార్ ప్యానళ్లతో నిర్మితమై ఉంటుంది. ఎలాంటి శబ్ధం, కాలుష్యం ఉండదు. జీపీఎస్, రిమోట్ సిస్టం, కెమెరా, బ్లూటూత్, సోలార్ ఎనర్జీ, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రొటోవేటర్, కల్టివేటర్, ట్రేలర్, సీడ్‌డ్రిల్, స్ర్పేయర్... తదితర పనిముట్లను దీనితో వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.12 లక్షలు అని కంపెనీ తెలిపింది.
అర గంటలో భూసార పరీక్షలు
ఆటోమెటిక్ సాయిల్ టెస్టింగ్ యూనిట్‌ను కృషితంత్ర సంస్థ ప్రదర్శించింది. భూమిలో నత్రజని, భాస్వరం, బోరాన్, సల్ఫర్, కాపర్, ఐరన్, జింక్, మాంగనీసు తదితర మూలకాల స్థాయి ఎంత ఉంది? భూసారం పెంచటానికి ఏంచేయాలి? నేల స్వభావం ఏమిటి? ఏ పంటలకు అనుకూలిస్తుంది? అనేవి కేవలం అరగంటలో వెల్లడించే భూసార పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా 15 రకాల పరీక్షలను ఏకకాలంలో చేయొచ్చు. 95 శాతం కచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఒక యూనిట్ విలువ రూ. 1.80 లక్షలు.
రాళ్ల నేలల్లో రుద్ర స్టోన్ పికర్
రాళ్లు, రప్పలతో ఉన్న భూములను సాగుకు యోగ్యంగా మార్చటానికి ‘రుద్ర స్టోన్ పికర్’ను అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్, ఐఐటీ ఖరగ్‌పూర్ సంయుక్తంగా తయారుచేశాయి. 4 గంటల్లో ఒక ఎకరం విస్తీర్ణంలోని రాళ్లను ఇది తొలగిస్తుంది. 5 సెం.మీ నుంచి 50 సెం.మీ వరకున్న రాళ్లను ఇది ఏరి పారేస్తుంది. ఒక్కో యూనిట్ ధర రూ.7.50 లక్షలు కాగా... అద్దెకు కూడా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. గంటకు రూ.2,500 అద్దె చెల్లించి రుద్ర స్టోన్ పికర్‌ను వినియోగించుకోవచ్చు.