False Propaganda on Medaram Tenders: మేడారం టెండర్లపై అసత్య ప్రచారం
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:02 AM
మేడారం జాతర పనుల టెండర్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర రెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు...
60-70 కోట్ల టెండర్లకు నా కంపెనీ ఆశపడదు!
సురేఖ అక్కతో భేదాభిప్రాయాల్లేవు
గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ములుగు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతర పనుల టెండర్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర రెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. రూ.60-70 కోట్ల టెండర్ల కోసం తన కంపెనీ తాపత్రయ పడదని స్పష్టం చేశారు. ‘నేనేంటో తెలిసిన వారు తప్పుడు ప్రచారాలు చేయరు. ఒకవేళ చేసినా, నేను పట్టించుకోను’ అని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర్‌తో కలిసి సోమవారం ఆయన మేడారంలో పర్యటించారు. శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. హరిత హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి లేకుండా సమీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించగా.. క్యాబినెట్ మంత్రులకు అనేక కార్యక్రమాలు ఉంటాయని పొంగులేటి చెప్పారు. మంత్రులకు ఒక రోజు వీలుంటే, మరో రోజు ఉండకపోవచ్చని అన్నారు. ఇదే చివరి సమీక్ష కాదని, ఇలాంటివి రాబోయే రోజుల్లో కనీసం 15 సార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కోసారి తాను లేకున్నా సీతక్క, సురేఖ అక్క సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరవుతారని, వీలుంటే అందరం కలిసి వస్తామని పేర్కొన్నారు. మేడారం అభివృద్ధి అనేది దైవ కార్యమన్నారు. ‘మీ సహచర మంత్రి మీపై ఫిర్యాదు చేశారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. పొంగులేటి ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. తన గురించి అందరికీ తెలుసని చెప్పారు. సీతక్క, సురేఖ అక్కలు సమ్మక్క-సారలమ్మ వంటి వారని కొనియాడారు.
సీఎం సూచనల మేరకు పనులు
సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు, ఆదివాసీల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు. గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులను 90 రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. మేడారంలో నిర్మాణాలు 200-300 ఏళ్ల వరకు ఉండేలా పనులు చేపడుతున్నామని చెప్పారు. రూ.211 కోట్ల నిధులు కేటాయించి మాస్టర్ ప్లాన్‌ను ఎంచుకున్నామన్నారు.