Animal Attack: పాపం పసివాడు
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:33 AM
నోరు తెరిచి అమ్మ అని కూడా పిలవలేని మూగవాడైన ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై ఒకటి, రెండు కాదు ఏకంగా 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి....
మూగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి
అరవలేక.. తప్పించుకోలేక నరకం
కొరికి పీక్కుతిన్న శునకాలు
8 తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన బాలుడు
హయత్‌నగర్‌లో ఘటన
హయత్‌నగర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నోరు తెరిచి అమ్మ అని కూడా పిలవలేని మూగవాడైన ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై ఒకటి, రెండు కాదు ఏకంగా 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. సాయం కోసం కేకలు కూడా వేయలేని నిస్సహాయుడైన ఆ బాలుడిని చుట్టుముట్టిన కుక్కలు.. పిల్లాడి చెవి, కాళ్లు, పిక్కలు, తల, పొట్ట.. ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టమొచ్చినట్టు పీక్కుతిన్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి రాయి విసరడంతో కుక్కలు పరుగు తీయగా.. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అదృష్టవసాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఏపీలోని ఒంగోలుకు చెందిన బెల్లపల్లి తిరుపతి, చంద్రకళ దంపతులు హయత్‌నగర్‌లోని షిర్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. తిరుపతి అపార్ట్‌మెంట్‌ల వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తుంటాడు. చంద్రకళ కూలీ పనులు చేస్తుంది. తిరుపతి దంపతులకు ప్రేమ్‌చంద్(8) అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ్ చంద్‌కు మాటలు రావు. అయితే, మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ప్రేమ్ చంద్ తమ ఇంటికి సమీపంలోని ఓ కిరాణ దుకాణానికి వెళుతుండగా ఓ కుక్కల గుంపు అతడిపై మూకుమ్మడిగా దాడి చేసి ఇష్టమొచ్చినట్టు కొరకేశాయి. శీతాకాలం కావడంతో ప్రేమ్ స్వెటర్ ధరించాడు. ఆ స్వెటర్‌ను కరిచి పట్టుకున్న కుక్కలు బాలుడిని ఈడ్చుకెళ్లాయి. స్వెటర్ లేకుంటే బాలుడి పేగులను కూడా బయటికి లాగేసేవి. మూగ వాడు కావడంతో కేకలు వేయలేక ప్రేమ్ నిస్సహాయంగా పడి ఉండగా.. ఈ దాడిని గమనించిన శ్రీనివాస్ అనే వ్యక్తి రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టాడు. అయితే, తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌చంద్‌ను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. బాలుడి చెవుకు వైద్యులు ఇప్పటికే శస్త్రచికిత్స చేశారని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ప్రేమ్‌చంద్ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి వారికి రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు.