Share News

kumaram bheem asifabad- గైర్హాజరు కాకుండా చూడాలి

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:10 PM

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు సమీక్షించాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో దహెగాం, బెజ్జూరు, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad-  గైర్హాజరు కాకుండా చూడాలి
జెండాగూడలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు సమీక్షించాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో దహెగాం, బెజ్జూరు, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 10 గంటల లోపు మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల, విద్యార్థుల గైర్హాజరుపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలని తెలిపారు. 50 శాతం విద్యార్థులు గైర్హాజరు అవుతున్నారని ఇందుకు గల కారణాలను తెలుసుకొని సంబంధిత విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడాలని తెలిపారు. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరు కాకూడదని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు విద్యతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన తాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల సమన్వయ కర్త అబిద్‌ అలీ, విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంక్షేమంలో భాగంగా చేపట్టిన మధ్యాహ్న భోజనంలో నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడ గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను గురువా రం సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, హాజరు పట్టికను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని మధ్యాహ్న భోజన మెనూ ద్వారా అందించడం జరుగుతుందని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం అంకుశాపూర్‌ గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి ఉపాధ్యా యులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:10 PM