Asaduddin Owaisi: వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:08 AM
ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఈఎంపీఎల్‌బీ) ప్రతినిధి బృందం కేంద్ర మైనారిటీల....
కేంద్రమంత్రికి ముస్లిం లా బోర్డు ప్రతినిధులు, ఎంపీ అసదుద్దీన్ వినతి
హైదరాబాద్, డిసెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఈఎంపీఎల్‌బీ) ప్రతినిధి బృందం కేంద్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు విజ్ఞప్తి చేసింది. ఏఈఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా ఫజల్-ఉర్-రహీంముజాద్దిది, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, మొహమ్మద్ జావేద్, జమాత్ ఇ ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ తదితరులు గురువారం ఢిల్లీలో కిరణ్ రిజిజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు కేవలం ఆరు నెలల్లో అప్‌లోడ్ చేయాలనే నిబంధనలతో పాటు అప్‌లోడ్ చేసే సందర్భంలోనూ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను వివరిస్తూ వక్ఫ్‌బోర్డులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా గుడువు పెంచినట్టు వివరించారు. కనీసం ఏడాది పాటు గడువు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.