Musi Riverfront Development: మూసీపై ముందుకు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:49 AM
మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్...
734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు
వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం
రూ.4100 కోట్ల నిధుల కోసం ఏడీబీతో కొలిక్కి వచ్చిన ఒప్పందం
మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్ సిద్ధం
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్ర జ్యోతి): మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) లోకేశ్ కుమార్ ఉత్తర్వు(జీవో138)లిచ్చారు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిసమత్‌పూర్, రాజేంద్రనగర్ మండలానికి చెందిన ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్న టీఈఈఆర్‌ఎల్, ఐఐపీహెచ్, వాలంతరి సంస్థలకు కేటాయించిన భూములతోపాటు శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ పరిధిలో హెచ్‌ఎండీ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. ఏపీ పునర్‌విభజన చట్టం 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ఈ భూముల్లో న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూసీ అభివృద్ధికి బదలాయించిన భూములకు ప్రత్యామ్నాయంగా ఆయా సంస్థలకు ఫ్యూచర్ సిటీలో కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. మూసీ అభివృద్ధికి ఏడీబీ నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఏడీబీ ద్వారా రూ.4100 కోట్ల రుణం తీసుకునేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబరు నెలలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ అధికారులు సమావేశమై నిధుల గురించి చర్చించారు. ప్రభుత్వం కోరిన నిధులు ఇచ్చేందుకు ఏడీబీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీ అభివృద్ధి ప్రణాళికలపై నవంబరులో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో ప్రభుత్వం ఉంది.