Musi River Revival: నదీ సహజత్వం కాపాడేలా మూసీ పునర్జీవం
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:55 AM
నది సహజత్వాన్ని కాపాడేలా మూసీ పునర్జీవం ఉండాలని.. నదీ ప్రవాహానికి స్వేచ్ఛనిస్తేనే నగరానికి శ్వాస తీసుకునే అవకాశం ఉంటుందని మూసీ పునర్జీవన చర్చలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు....
చర్చాగోష్ఠిలో వక్తలు
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నది సహజత్వాన్ని కాపాడేలా మూసీ పునర్జీవం ఉండాలని.. నదీ ప్రవాహానికి స్వేచ్ఛనిస్తేనే నగరానికి శ్వాస తీసుకునే అవకాశం ఉంటుందని మూసీ పునర్జీవన చర్చలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. పునర్జీవన పనులు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా నదీ జీవనం, దాని పరీవాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహద పడటంతోపాటు సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతకు అద్దంపట్టేలా ఉండాలని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీ నరసింహారెడ్డి.. నదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల కుటుంబాల ఉపాధి దెబ్బ తినకుండా పునర్జీవన పనులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి అభిప్రాయాలు తెలపాలని నిపుణులను కోరారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం నదీ కాలుష్యం, వరద తీవ్రతపై అధ్యయనం చేశామని, 55 కి.మీ మేరకు సర్వే చేసి, అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ నదులు, చెరువులు, ఇతర జల వనరుల సంరక్షణకు రాజ్యాంగంలోని 14,15,21 అధికరణాల అమలుకు శ్రద్ధ వహించడం అభినందనీయమన్నారు. మూసీ పునర్జీవ ప్రణాళిక చాలా అద్భుతమన్న రాజేంద్ర సింగ్.. నది పరిశుభ్రంగా ఉండటంతోపాటు ప్రవాహానికి ఆటంకాల్లేకుండా అభివృద్ధి చేస్తే మూసీ నది విజయవంతమైన జీవన వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు. ఆసియా డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధి ఎలెక్సియా మిచెలెస్ మాట్లాడుతూ.. జీవనోపాధులపై ప్రతికూల ప్రభావం పడకుండా.. నగర పురోభివృద్ధికి దోహద పడేలా.. పర్యావరణ, సామాజిక, ఆర్థిక మార్పునకు ప్రతీకగా మూసీ అభివృద్ధి నిలవాలన్నారు. నగరాభివృద్ధి, పర్యావరణ సమతుల్యతలో మూసీ కీలకం కావాలన్న ఎలెక్సియా మిచెలెస్.. 2 దశాబ్దాలుగా వేగంగా జరిగిన హైదరాబాద్ అభివృద్ధి ప్రభావం ఆ నదిపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం, వరద, ముంపు తీవ్రత పెరుగుదల, ఘన వ్యర్థాలు, తీరంలో అనధికారిక నిర్మాణాలు నదీ సహజత్వాన్ని దెబ్బ తీశాయన్నారు. చర్చాగోష్టిలో పర్యావరణవేత్త తపస్, క్లైమేట్ చేంజ్-డీఆర్‌ఆర్ స్పెషలిస్టు డాక్టర్ శ్రీజా ఎస్ నాయర్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రముఖుడు అర్జున్ శశిధరన్ తదితర నిపుణులు పాల్గొన్నారు.
మూసీ పునర్జీవమైతే ఇలా ఉంటుంది
గాంధీ సరోవర్ ఆన్ స్ర్కీన్.. వినూత్నంగా ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక ఎలా ఉంటుందో ముందే చూపించేలా గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గర ప్రత్యేక స్ర్కీన్‌ను ఏర్పాటు చేసింది. ఆ స్ర్కీన్‌పై మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్, రాజేంద్రనగర్ డెవల్‌పమెంట్, ఈస్ట్-వెస్ట్ కారిడార్, మీర్‌అలాం ట్యాంక్ ఏరియా డెవల్‌పమెంట్ చూసేలా వినూత్న ఏర్పాటు చేశారు. ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఆ స్ర్కీన్ వద్ద ఆయా ప్రాజెక్టుల పేర్లతో కూడిన ప్రత్యేక మ్యాగ్నెటర్‌లను ఉంచారు. వాటిలో చూడాలనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన మ్యాగ్నెటర్‌ను ఆ స్ర్కీన్‌పై సూచించిన రింగులో ఉంచగానే దానివివరాలు అన్నీ వీడియో, ఫొటో రూపంలో వెంటనే దర్శనమిస్తున్నాయి. దాంతో ప్రాంగణానికి వచ్చిన చాలా మంది ఆయా ప్రాంతాలను తిలకించారు.